Heart And Women: ప్రతి మహిళకు కార్డియాలజిస్ట్ అందించే చిట్కాలేంటో తెలుసా..?
గుండె జబ్బులు...చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కర్నీ ప్రభావితం చేస్తున్నాయి. మన శరీరంలో అతిముఖ్యమైన అవయవం కాబట్టి...గుండెను భద్రంగా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు.
- By Hashtag U Published Date - 12:56 PM, Thu - 10 March 22

గుండె జబ్బులు…చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కర్నీ ప్రభావితం చేస్తున్నాయి. మన శరీరంలో అతిముఖ్యమైన అవయవం కాబట్టి…గుండెను భద్రంగా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. తెలిసి ప్రమాదం తెచ్చుకోవడం కన్నా…గుండెను భద్రంగా కాపాడుకోవడం మంచిది. కొంతమంది లైఫ్ స్టైల్ కారణంగా హార్ట్ రిస్క్ లు తప్పడం లేదు. ఎన్నో తీవ్రమైన గుండె జబ్బులకు కారణం అవుతున్నాయి.
మనదేశంలో 50శాతం మంది మహిళలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. గుండె జబ్బులు మహిళలను కూడా ప్రభావితం చేస్తుండటంతో…తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవల్సిందేనని కార్డియాక్ సర్జన్స్ సూచిస్తున్నారు.
చాలామందిలో గుండె పోటు వచ్చే ముందు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడమే…హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుంది. మన జీవన శైలిని మార్చుకుంటే…గుండె సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. హార్ట్ ఎటాక్ కు సంబంధించి ప్రతి మహిళా తీసుకోవల్సిన 9 ఆరోగ్యకరమైన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోండి
అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం అవుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని రెట్టింపు చేస్తోంది. ఉప్పు, నూనె తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
2. వ్యాయామం
ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ కనీసం 30నిమిషాలు వ్యాయామం చేస్తే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రన్నింగ్, స్విమ్మింగ్, నడవడం, ఏరోబిక్ వర్క్ వుట్స్ లాంటివి ప్రతిరోజూ చేస్తుండాలి. ఇవన్నీ కూడా గుండె కొట్టుకోవడం, రక్తప్రసరణ పెంచడంతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు.
3. గుండెకు మేలు చేసే ఆహారం
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న పాల ఉత్పత్తుల, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో ఉప్పు, చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది.
4. చెడు అలవాట్లకు దూరం
ధూమపానం, మద్యపానం గుండెకు హానిచేస్తాయి. రక్తపోటును పెంచుతాయి. రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె రెండింతలు కష్టపడాల్సి ఉంటుంది. కాలక్రమేణా శరీర కణాలకు ఆక్సిజన్ను రవాణ చేయడం మరింత కష్టంగా మారుతుంది. వీలైనంత త్వరగా చెడు అలవాట్లను మార్చుకోవడం మంచిది.
5. మంచి నిద్ర
సాధారణంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర చాలా అవసరం. ఒక వ్యక్తికి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. ఎందుకంటే ఇది శరీర కణాల పునర్మిణానికి సహాయపడుతుంది. నిద్రలేమితో రక్తపోటు ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.
6. జనన నియంత్రణలో జాగ్రత్తలు
గర్భనిరోధకాలు రక్తపోటుకు దారితీస్తాయి. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులకు కూడా కారణం కావచ్చు. గర్బనిరోధక మాత్రలను ప్రారంభించే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
7. ఒత్తిడిని తగ్గించుకోండి
ఒత్తిడి రక్తపోటు పెంచడమే కాదు..అనారోగ్యకరమైన ఆహారాన్ని..జీవనశైలిని మార్చేలా చేస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా, ధ్యానం చేయడానికి ప్రయత్నించండి. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేసినట్లయితే ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
8. ఆరోగ్యకరమైన bmi
గుండెజబ్బులకు దారితీసే షుగర్ ను నివారించేందుకు బరువు తగ్గడం చాలా ముఖ్యం. స్త్రీలు బరువు తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా హార్ట్ చెకప్ లు చేయించుకోవాలి. 30 సంవత్సరాల వయస్సు నుంచి మహిళలందరూ హార్ట్ చెకప్ లు తప్పనిసరిగా చేయించాలి. కొలెస్ట్రాల్, రక్తపోటు, షుగర్ వంటి టెస్టులు కూడా చేయించుకోవడం మంచిది.
చిన్న వయస్సు నుంచే మన ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరుచుకున్నట్లయితే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలను నివారించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా గుండెసంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే మీరు క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించినట్లయితే…గుండె జబ్బులనే కాదు..ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది.