Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?
Pregnant lady : గర్భం దాల్చిన ప్రతి మహిళకు కడుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల గురించిన ఆందోళన సహజం. ఈ ఆందోళనలను దూరం చేసి, బిడ్డ క్షేమాన్ని నిర్ధారించడానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన స్కాన్‌లను సిఫార్సు చేస్తారు.
- By Kavya Krishna Published Date - 02:48 PM, Tue - 1 July 25

Pregnant lady : గర్భం దాల్చిన ప్రతి మహిళకు కడుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల గురించిన ఆందోళన సహజం. ఈ ఆందోళనలను దూరం చేసి, బిడ్డ క్షేమాన్ని నిర్ధారించడానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన స్కాన్‌లను సిఫార్సు చేస్తారు. అవి మూడో నెల నుంచి తప్పకుండా చేయించాల్సి ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్‌లు తల్లికి ఎలాంటి హాని కలిగించకుండా, గర్భంలోని శిశువు ఆరోగ్యం గురించి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ప్రతి దశలోనూ బిడ్డ ఎదుగుదలను పర్యవేక్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో (ఫస్ట్ ట్రెమిస్టర్) చేసే ముఖ్యమైన స్కాన్ ‘ఎన్టీ స్కాన్’ (Nuchal Translucency Scan). దీనిని సాధారణంగా 11 నుంచి 14 వారాల మధ్య చేస్తారు. ఈ స్కాన్ ప్రధాన ఉద్దేశం బిడ్డ మెడ వెనుక భాగంలో ఉండే ద్రవం (న్యూకల్ ట్రాన్స్‌లూసెన్సీ) మందాన్ని కొలవడం. ఈ మందం ఎక్కువగా ఉంటే బిడ్డకు డౌన్ సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు ఉండే ప్రమాదం ఉందని సూచిస్తుంది. ఇది కేవలం ఒక సూచన మాత్రమే కానీ, నిర్ధారణ పరీక్ష కాదు. దీంతో పాటు బిడ్డ గుండెచప్పుడు, ప్రాథమిక అవయవాల నిర్మాణం, గర్భం దాల్చిన కచ్చితమైన తేదీని కూడా నిర్ధారిస్తారు.
రెండవ త్రైమాసికంలో, అంటే 18 నుంచి 22 వారాల మధ్య చేసే అత్యంత కీలకమైన స్కాన్ ‘టిఫా స్కాన్’ (Targeted Imaging for Fetal Anomalies). దీనిని అనామలీ స్కాన్ అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టే, ఈ స్కాన్‌లో బిడ్డకు సంబంధించిన అన్ని ప్రధాన అవయవాలను (మెదడు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముక, చేతులు, కాళ్లు) క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అవయవ లోపాలు ఏవైనా ఉన్నాయా, నిర్మాణం సరిగ్గా జరిగిందా అని చూస్తారు. అలాగే, ఉమ్మనీరు స్థాయి, మాయ (ప్లాసెంటా) స్థానం, బిడ్డ బరువును అంచనా వేస్తారు. టిఫా స్కాన్ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం గురించి ఒక సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది.
బిడ్డ ఎదుగుదల (Fetal Growth) దాదాపు ప్రతీ స్కాన్‌లోనూ అంచనా వేయబడుతుంది. ముఖ్యంగా, తల చుట్టుకొలత, పొట్ట చుట్టుకొలత, తొడ ఎముక పొడవు వంటి కొలతల ఆధారంగా బిడ్డ బరువును, ఎదుగుదలను లెక్కిస్తారు. టిఫా స్కాన్ తర్వాత కూడా, అవసరాన్ని బట్టి 28-32 వారాల మధ్య ‘గ్రోత్ స్కాన్’ చేస్తారు. ఈ స్కాన్‌లు బిడ్డ వారానికి తగినట్టుగా ఎదుగుతున్నాడా లేదా అని తెలుపుతాయి. ఎదుగుదల సరిగా లేకపోతే (గ్రోత్ రెస్ట్రిక్షన్), దానికి గల కారణాలను అన్వేషిస్తారు.
ఒకవేళ స్కాన్‌లో బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తారు. తల్లికి పోషకాహారం, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇస్తారు. రక్తహీనత లేదా అధిక రక్తపోటు వంటి సమస్యలుంటే వాటికి చికిత్స అందిస్తారు. బిడ్డకు రక్త ప్రసరణ సరిగ్గా అందుతుందో లేదో తెలుసుకోవడానికి ‘డాప్లర్ స్కాన్’ వంటి అదనపు పరీక్షలు చేస్తారు. తీవ్రమైన సందర్భాల్లో, బిడ్డ కడుపులో ఉండటం కంటే బయట సురక్షితమని భావిస్తే, కాన్పును ముందుగానే ప్రేరేపించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే గర్భిణీలు తప్పకుండా డాక్టర్ల సూచన మేరకు స్కానింగ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే బిడ్డకు సంబంధించి ఎదుగుదల, స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యులు మార్గదర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది.
Kavya Maran : సోషల్ మీడియా మీమ్స్‌పై తొలిసారి స్పందించిన కావ్య మారన్