Tea: రోజుకు ఎన్ని సార్లు టీ తాగాలి.. ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Tea: రోజుకి ఎన్ని సార్లు టీ తాగాలి. ఎక్కువగా టీ తాగితే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమనంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Sat - 11 October 25

Tea: మనలో చాలా మందికి టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే కాఫీ తాగనిదే కొంతమంది పనులు కూడా మొదలు పెట్టరు. మరికొందరికి రోజులో ఒక్కసారైనా టీ తాగనిదే రోజు కూడా గడవదు. అలా కొందరికి టీ అన్నది వ్యసనంగా మారిపోయింది. అయితే రోజుకు ఒకసారి అం పరవాలేదు కానీ చాలా మంది పదేపదే రోజులో చాలాసార్లు తాగుతూ ఉంటారు. టీలో కూడా రకరకాల పదార్థాలు వేసుకుని తాగుతారు. యాలకులు, లవంగాలు యాడ్ చేసుకుంటారు. కొన్ని తరాలుగా ఈ అలవాటు కొనసాగుతోంది.
రోజుకు మూడు నాలుగు కప్పుల టీ తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయం తెలిసిందే. అయినా కూడా కొందరు ఆ అలవాటుని మార్చుకోలేక పోతుంటారు. అయితే టీ తాగడం వల్ల కలిగే నష్టాల విషయానికి వస్తే.. టీ ఎక్కువగా తాగడం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. టీలో కెఫేన్ ఎక్కువగా ఉంటుంది. పాలు, చక్కెర కలపడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. అంతే కాదు. కెఫేన్ కారణంగా నిద్ర సరిగ్గా పట్టదు. ఫలితంగా నిద్రలేమితో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇక కెఫేన్ వల్ల ఆందోళన కూడా పెరుగుతుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. అతిగా టీ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి గురి అవుతారు. ఇది చాలా ప్రమాదకరం. టీలో ఉండే టానిన్స్ జీర్ణ వ్యవస్థను పాడు చేస్తాయి. కడుపులో వికారాన్ని పెంచుతాయట. కొన్ని సార్లు టీ అతిగా తాగడం వల్ల మలబద్ధకం కూడా వచ్చే అవకాశం ఉంటుందట. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం మంచిదే అని, అంత కన్నా ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవడం మంచిదని చెబుతున్నారు. రెండు లేదా మూడు కప్పులకు మించి టీ తాగడం అన్నది ఆరోగ్యానికి చాలా హానికరం అని చెబుతున్నారు. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆకలిగా అనిపించదు. ఇది ఆకలిని చంపి వేస్తుంది. అలాగే చాలా మంది టీ తాగేటప్పుడు రస్క్ బిస్కెట్స్ వంటివి తింటూ ఉంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదట.