Goat Milk: మేకపాలు ఎప్పుడైనా తాగారా.. ఇది తెలిస్తే తాగకుండా అస్సలు ఉండలేరు?
మేక పాలు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 04:30 PM, Fri - 30 August 24
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు ప్రతిరోజు పాలు తాగమని సూచిస్తూ ఉంటారు. టీ కాఫీలకు బదులుగా ఎక్కువగా పాలు తాగమని చెబుతూ ఉంటారు. అయితే పాలు అనగానే చాలామందికి ఆవు పాలు లేదా గేదె పాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. చాలా వరకు ఆవు లేదా గేదెపాలనే ఎక్కువగా తాగి ఉంటారు. అయితే ఎప్పుడైనా మేక పాలు తాగారా. మేక పాలు మనలో చాలా తక్కువ మంది మాత్రమే తాగి ఉంటారు. మరి ముఖ్యంగా పల్లెటూరి ప్రాంతాల్లో ఉండే వారు మాత్రమే మేకపాలను తాగి ఉంటారు. మేక పాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. మేక పాలలో పోషకాలు మెండుగా ఉంటాయి.
ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయట. మరి మేకపాల వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. నిజానికి మేక పాలు తక్కువ ఖరీదైనవి. ఎందుకంటే ఆవులు గేదెలు లాగా మేకలు లీటర్లకు లీటర్లు పాలు ఇవ్వలేవు. కేవలం కొన్ని పాలను మాత్రమే ఇస్తాయి. అందుకే మార్కెట్లో కూడా వీటికి ధర ఎక్కువ. దీనిలోని విటమిన్లు, ఖనిజాలు, పోషకాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆవు పాల కంటే మేక పాలనే తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొంతమందికి ఈ పాలు నచ్చవు. ఎందుకంటే ఇవి చాలా చిక్కగా ఉంటాయి. కానీ ఈ పాలను తాగితే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. సాధారణ పాలతో పోల్చుకుంటే మేకపాలు చాలా చిక్కగా ఉంటాయి.
మేక పాలు ఆవు పాలతో సమానమైన కొవ్వును కలిగి ఉంటాయి. కానీ మేక పాలలోని ఫ్యాట్ గ్లోబుల్స్ ఆవు పాల కంటే చిన్నవి. అందుకే మేకపాలను జీర్ణించుకోవడం చాలా సులభం. మేక పాలు మీ కడుపులో పెరుగుగా మారుతాయి. అయితే ఈ పెరుగు ఆవు పాలతో తయారైన పెరుగు కంటే చాలా మృదువుగా ఉంటుంది. 10% పెరుగు ఉన్న ఆవు పాలతో పోలిస్తే, మేక పాలలో 2% పెరుగు మాత్రమే ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అదేవిధంగా మేక పాలలో రెండు బయోయాక్టివ్ పదార్థాలు కొవ్వు ఆమ్లాలు, ఒలిగోసాకరైడ్లు శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ పదార్థాలు శారీరక మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మీ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పెంచడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మేక పాలలో ఆవు పాలు కంటే కప్పుకు 12 శాతం తక్కువ లాక్టోస్ ఉంటుంది. అలాగే ఇది పెరుగుగా మారినప్పుడు ఈ లాక్టోస్ మరింత తగ్గుతుంది. మితమైన లాక్టోస్ సున్నితత్వం ఉన్నవారికి ఆవు పాలు కంటే మేక పాలు పాల ఉత్పత్తులు మంచివి. ఇవి జీర్ణవ్యవస్థకు తక్కువ చికాకును కలిగిస్తాయని చెబుతున్నారు. అలాగే మేకపాలలో ఎక్కువగా ఫ్రీ బయోటిక్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మేక పాలలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆవు పాలలో లభించే వాటి కంటే ఎక్కువ ఉంటాయి. మన శరీరం ఈ ఖనిజాలను మరింత సమర్థవంతంగా గ్రహించి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే పోషక శోషణను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.