Surgical Infections: దడ పుట్టిస్తున్న సర్జికల్ ఇన్ఫెక్షన్లు.. సంచలన అధ్యయన నివేదిక
161 మంది రోగులకు శస్త్ర చికిత్సల తర్వాత ఇన్ఫెక్షన్(Surgical Infections) సోకిందని గుర్తించారు.
- By Pasha Published Date - 10:20 AM, Thu - 20 February 25

Surgical Infections: సర్జికల్ ఇన్ఫెక్షన్లు దడ పుట్టిస్తున్నాయి. సర్జరీ చేసిన తర్వాత కలిగే ఈ ఇన్ఫెక్షన్లు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సర్జరీ చేయించుకున్న రోగులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యాక, వారికి సర్జరీ జరిగిన భాగంపై సరైన వైద్య పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ ఇన్ఫెక్షన్ వస్తోంది. ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది సర్జికల్ సైట్ ఇన్‌ఫెక్షన్ (ఎస్‌ఎస్‌ఐ) సమస్యతో సతమతం అవుతున్నారు. వీరిలో 54 శాతం మందికిపైగా ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల బాధితులే కావడం గమనార్హం. ఈమేరకు వివరాలతో భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఒక నివేదికను విడుదల చేసింది.
Also Read :Ronan Law : భారత బాలుడి పేరుతో బ్రిటన్‌లో ‘రోనన్ లా’.. ఏమిటిది ? ఎవరీ రోనన్ ?
ఐసీఎంఆర్ అధ్యయనమిదీ..
ఢిల్లీ ఎయిమ్స్, మణిపాల్‌లోని కస్తూర్బా, ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రుల్లో 3,090 మంది రోగులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 161 మంది రోగులకు శస్త్ర చికిత్సల తర్వాత ఇన్ఫెక్షన్(Surgical Infections) సోకిందని గుర్తించారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం పాటు నిర్వహించే సర్జరీల్లోనే ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువని తేలింది. శస్త్ర చికిత్సల తర్వాత ఇన్ఫెక్షన్ సోకితే రోగులు కోలుకునే సమయంతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. కత్తితో చేసే సంప్రదాయ సర్జరీల్లో పెద్ద కోతలు విధిస్తారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. ల్యాప్రోస్కొపీ, రోబోటిక్స్ సర్జరీలతో ఆ ముప్పు తక్కువ.
కారణాలివీ..
- సర్జరీ చేసిన తర్వాత సరిగ్గా స్టెరిలైజేషన్ చేయడం లేదు. దీనివల్ల రోగులకు సర్జరీ జరిగిన భాగంలో ఇన్ఫెక్షన్ వస్తోంది.
- సర్జరీ చేయించుకున్న కొందరు రోగులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. ఇలాంటి వారికి సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ ప్రబలే ముప్పు ఎక్కువగా ఉంటోంది.
- సర్జరీలు చేయడానికి ముందే ప్రీ–ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ చేయాలి. కానీ చేయడం లేదు.
- గుండె వాల్వ్, జాయింట్ రిప్లేస్‌మెంట్ సర్జరీల్లో శరీరంలో స్టీల్ మెటల్స్ అమరుస్తారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంటాయి.
- భారత్‌లో సర్జికల్ ఇన్ఫెక్షన్లు ప్రబలే రేటు 5.2 శాతంగా ఉంది. అధిక ఆదాయ దేశాల కంటే ఇది చాలా ఎక్కువ.