856 Snakebites Vs A Man: ఇతగాడికి 856సార్లు పాముకాట్లు.. పవర్ ఫుల్ విరుగుడు రెడీ
పాము విషం మరింత మెరుగైన రక్షణ కల్పించే యాంటీ వీనమ్‌ను అమెరికా సైంటిస్టులు(856 Snakebites Vs A Man) తయారు చేశారు.
- By Pasha Published Date - 09:49 AM, Sun - 4 May 25

856 Snakebites Vs A Man: మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎంతోమంది పాముకాటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలకు ఎంతో క్షోభ మిగులుతోంది. పాముకాటుకు విరుగుడును ‘యాంటీ వీనమ్’ అంటారు. దీన్ని తయారు చేసేందుకు ఇప్పటివరకు పాము విషాన్ని గుర్రాలు లేదా గొర్రెల్లోకి ఎక్కిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా వాటి శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలతో యాంటీవీనమ్ మందును తయారుచేస్తున్నారు. అయితే ఇందులోని యాంటీబాడీలు జంతువులు ఉత్పత్తి చేసినవి కావడంతో.. కొన్నిసార్లు బాధితులకు ఇచ్చినప్పుడు రియాక్షన్‌కు గురవుతున్నారు. వారిలో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే దిశగా అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. అదేమిటో తెలుసుకుందాం..
Also Read :Weekly Horoscope : వారఫలాలు.. మే 5 నుంచి మే 11 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
18 ఏళ్లలో 856 సార్లు పాముకాట్లు..
పాము విషం మరింత మెరుగైన రక్షణ కల్పించే యాంటీ వీనమ్‌ను అమెరికా సైంటిస్టులు(856 Snakebites Vs A Man) తయారు చేశారు. అదెలా సాధ్యమైందో తెలియాలంటే మనం అమెరికాలోని విస్కాన్సిన్ ప్రాంతానికి చెందిన తిమోతీ ఫ్రీడ్ గురించి తెలుసుకోవాలి. ఔను.. కేవలం అతడి వల్లే పవర్ ఫుల్ పాము కాటు విరుగుడు (యాంటీ వీనమ్)ను తయారు చేయడం సాధ్యమైంది. తిమోతీ ఫ్రీడ్ తన ఇంట్లో పదుల సంఖ్యలో పాములను పెంచుతుంటాడు. ఈ పాముకాట్ల నుంచి తనను తాను రక్షించుకునేందుకు తిమోతీ ఫ్రీడ్ స్వల్ప మోతాదులో పాము విషాన్ని శరీరంలోకి ఎక్కించుకునేవాడు. క్రమంగా తాను తీసుకునే పామువిషం డోసును పెంచాడు. ఆ తర్వాత పాములతో కాట్లు వేయించుకొని చూశాడు. అయితే పాముకాట్ల తర్వాత అతడికి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. పాముకాటుకు విరుగుడుగా పనిచేసే యాంటీ బాడీలు అప్పటికే అతడి శరీరంలో రెడీగా ఉన్నందున.. పాము కాట్ల వల్ల ప్రభావితుడు కాలేదు. తిమోతీ ఫ్రీడ్ గత 18 ఏళ్లలో 856 సార్లు పాముకాట్లు వేయించుకోవడమో, వాటి విషాన్ని శరీరంలోకి ఎక్కించుకోవడమో చేశాడట. ఏకంగా 16 రకాల ప్రమాదకర పాము జాతుల విషం అతడి శరీరంలోకి చేరి, రక్తంలో పవర్ ఫుల్ యాంటీబాడీలు తయారయ్యాయి. దీనివల్లే పాముకాటులను తట్టుకునేలా అతడు తయారయ్యాడు.
Also Read :Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?
తిమోతీ నుంచి సేకరించిన రక్తంతో ఏం చేశారంటే..
తాజాగా తిమోతీ ఫ్రీడ్ నుంచి సేకరించిన రక్తంతో సెంటీవ్యాక్స్ అనే టీకా తయారీ కంపెనీ పాముకాటు విరుగుడు ( యాంటీవెనమ్)ను తయారుచేసింది. తిమోతీ నుంచి సేకరించిన రెండు రకాల యాంటీబాడీలతో పాటు వారెస్ప్ల్లాడిబ్ అనే పదార్థాన్ని సైంటిస్టులు వినియోగించారు. అనేకరకాల పాముల విషాలను ఎదుర్కొనేందుకు ఈ యాంటీ వీనమ్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. ఇప్పటికే ఎలుకలపై దీన్ని టెస్ట్ చేశామని, తదుపరిగా కుక్కలపై టెస్ట్ చేస్తామని పరిశోధకులు వెల్లడించారు. ఈ యాంటీ వీనమ్‌ను మనుషులపై ప్రయోగించడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుందన్నారు.