Shivratri Fasting Foods : శివరాత్రి ఉపవాసం పూర్తయ్యాక వీటిని అల్పాహారంగా తినొచ్చు..
శివరాత్రి ఉపవాసం చేసిన వారు తినే ఆహారంలో ఉప్పు ఉండకూడదు. అందుకే పండ్లు, ద్రవపదార్థాలనే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి, ఇతర మసాలా పదార్థాలు కూడా ఉండరాదు. ఉపవాసం ఉండటం వల్ల కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి..
- By News Desk Published Date - 05:45 PM, Fri - 8 March 24

Shivratri Fasting Foods : మహాశివరాత్రి.. తెలుగు వారే కాదు.. యావత్ దేశమంతా ఉన్న హిందువులు ఎంతో ఘనంగా, భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో జరుపుకునే పెద్ద పండుగల్లో ఇది మొదటిది. జన్మకో శివరాత్రి అంటారు కదా పెద్దలు. ఒక్క శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే.. ఏడాదంతా మాస శివరాత్రులు ఉపవాసాలు చేసినంత పుణ్యఫలితం ఉంటుందట. శివారాధకులు ఖచ్చితంగా ఈ రోజున ఉపవాసం ఉంటారు. అలాగే జాగారం చేస్తారు. శివునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజలు చేస్తారు. ఆలయాల్లో శివ-పార్వతుల కల్యాణం చేస్తారు.
ప్రత్యేకంగా ఈ రోజున ఉపవాసం చేసేవారు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏమీ తినరు. సాయంత్రం శివపూజ చేసి.. ఉపవాసాన్ని విరమిస్తారు. ఎక్కువగా పండ్లనే ఆహారంగా తీసుకుంటారు. మరి ఎలాంటి పండ్లను ఆహారంగా తీసుకోవాలి. తినే ఆహారంలో ఏవేవి ఉండకూడదో తెలుసుకుందాం.
శివరాత్రి ఉపవాసం చేసిన వారు తినే ఆహారంలో ఉప్పు ఉండకూడదు. అందుకే పండ్లు, ద్రవపదార్థాలనే తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి, ఇతర మసాలా పదార్థాలు కూడా ఉండరాదు. ఉపవాసం ఉండటం వల్ల కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి.. అరటిపండును తినడం మంచిది. ఇందులో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇన్ స్టంట్ ఎనర్జీ కూడా అందుతుంది. అలాగే యాపిల్ కూడా ఆరోగ్యానికి మంచిది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ద్రాక్షపండ్లను కూడా తినొచ్చు.
రాత్రికి అల్పాహారం తినాలనుకున్నవారు.. చిలగడదుంపలతో రైతా చేసుకోండి. చిలగడదుంపల్ని ఉడికించి పొట్టు తీసేయాలి. సన్నగా ముక్కలుగా తరిగి.. ఒకగిన్నెలో వేసి, అందులో పెరుగు వేసి గిలకొట్టి.. పంచదార కలుపుకుని తినేయాలి. అలాగే ద్రాక్ష రబ్డీ కూడా తినొచ్చు. చిక్కని పాలను ఒక కళాయిలో పోసి.. సన్నని మంటపై కాచుకోవాలి. మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. చిన్న మంటపై కొద్దిసేపు మరగనిస్తే చిక్కడా అవుతాయి. చల్లారిన తర్వాత.. ద్రాక్షను చిన్న చిన్న ముక్కలుగా కలుపుకోవాలి. ఇందులో పిస్తా, బాదం ముక్కలు చల్లుకుని.. కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచుకుని తింటే ఇంకా మంచిది.
Also Read : Sugar: కాఫీ తాగేటప్పుడు ఎక్కువ చెక్కర ఉపయోగిస్తున్నారా.. జాగ్రత్త?