Kashi: కాశీకి వెళ్తే ఇష్టమైనవి వదిలేయాలా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
కాశీకి వెళ్లిన తర్వాత మనకు చాలా ఇష్టమైన వాటిలో ఏదో ఒకటి వదిలిపెట్టాలని దానివల్ల అంతా మంచి జరుగుతుందని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:35 PM, Tue - 21 January 25

హిందువులు ఆధ్యాత్మిక ప్రదేశంగా భావించే ప్రదేశాలలో చివరి ప్రదేశం కాశీ పట్టణం. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారి అయినా కాశీకి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. కాశీలోని మరణించాలని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్లు కూడా ఎందరో ఉంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నాయి. అయితే కాశీకి వెళ్లిన చాలా మంది చెప్పే ఒకే ఒక విషయం మనకు ఇష్టమైన ఆహార పదార్థాన్ని ఏదైనా వదిలేయాలని, ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుందని అంటూ ఉంటారు. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాశీకి వెళ్తే కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.
అందులో మర్మమేమిటి? అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా కాశీకి వెళితే కాయ లేదా పండు వదిలేయాలని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసీతెలియక పాటిస్తున్నారు. కాశీకి వెళ్లి గంగలో స్నానం చేసి కాయో పేక్షో గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు తిరిగి వెళ్లాలి అని శాస్త్రం చెబుతోంది. అయితే ఇక్కడ కాయో పేక్ష అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరం పై మమకారం విడిచి పెట్టి భగవంతుని వైపు ప్రయాణం చేయాలని అర్థం. అలాగే ఫలాపేక్ష అంటే మనం చేసే కర్మఫలం పై ఆపేక్ష విడిచి పెట్టాలని అర్థం. అంటే ఏ పని చేసినా భగవంతునికి అర్పించినట్లుగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా చేయాలని, చేసిన కర్మ ఫలితంపై ఆపేక్ష పెంచుకోకూడదని అర్థం.
అంటే చితిలో కాలిపోయే ఈ కాయం అంటే శరీరంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెబుతున్నారు. కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయ లేదా పండుగా మారిపోయింది అంతేగాని కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏమి ఉండదు. శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అది అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఆ సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేగాని మామిడిపండుని, వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని పండితులు చెబుతున్నారు. అందుకే కాశీకి వెళితే మనకి శత్రువులైన ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల ఫలం మీద కోరికని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకుని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందడమే పరమార్థంగా భావించాలి.