Lord Ganesha Idol: ఇంట్లో ప్రతిష్టించే వినాయక విగ్రహం ఎంత ఎత్తు ఉండాలో తెలుసా?
ఇంట్లో వినాయకుని ప్రతిష్టించే ముందు కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 04:47 PM, Wed - 4 September 24
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కొన్ని ప్రదేశాలలో గణనాథ విగ్రహాలను తెచ్చి ఏర్పాటు చేయడంతో పాటు అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరొకవైపు మండపాల ఏర్పాటులో భాగంగా నిమగ్నమయ్యారు. కాగా ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుండి వరుసగా 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ఇంటి ఆలయంలో లేదా మండపాలు ఏర్పాటు చేసి ప్రతిష్టించి ఆచారాల ప్రకారం పూజిస్తారు.
కొందరు ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలు చేసి ఆ తర్వాత సాయంత్రం వెళ్లి వీధుల్లో ఏర్పాటు చేసిన గణనాధుల విగ్రహాల దగ్గర పెడుతూ ఉంటారు. అయితే విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించడం మంచిదే కానీ పూజ చేసే సమయంలో కొన్ని రకాల పొరపాట్లు అస్సలు చేయకూడదని చెబుతున్నారు. అలాగే మనం ఇంటికి తెచ్చుకొని విగ్రహం ఎత్తుని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయట. నలుపు రంగు గణేష్ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, వ్యాధి లోపాల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే నారింజ రంగు గణపతి ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. జీవితంలో సంతోషం, శాంతి, ఆనందం కోసం గణపతి బప్పా ఆశీస్సులు పొందడానికి మీరు ఇంట్లో తెల్లటి రంగు గణేష్ విగ్రహాన్ని తీసుకురావాలనీ సూచిస్తున్నారు. ఈ రంగు గణపతిని వాయువ్య దిశలో ఉంచాలట. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే గణేశుని విగ్రహాన్ని పూజ గదిలో, ఇంట్లోని ఆఫీసులో ప్రతిష్టించడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ గణేశుడి విగ్రహాలు ఉంచకూడదు. అది మాత్రమే కాకుండా వినాయకుడి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజించడం వల్ల ధనానికి కొదువ ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు విగ్రహాలు పక్క పక్కన పెట్టి పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో వినాయకుడి విగ్రహం ప్రతిష్టించాలని అనుకుంటున్నారా? అయితే గణపతి తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రయోజనకరంగా ఉంటుందట. అలాగే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలంటే విగ్రహం ఎత్తు 6 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు.
Related News
Clash In Surat : సూరత్‌లో ఉద్రిక్తత.. గణేశ్ మండపంపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకలు
నగరంలోని సయ్యద్‌పురా ప్రాంతంలో గణపతి మండపంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట(Clash In Surat) జరిగింది.