Ganesh Nimajjanam 2024: గణేష్ విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?
గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక ఉన్న కారణం గురించి తెలిపారు.
- By Anshu Published Date - 02:30 PM, Mon - 9 September 24

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలలో వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇకపోతే ఈ వినాయక చవితి ఉత్సవాలు జరగడం అన్ని ఒక ఎత్తు అయితే నిమజ్జనం మరొక ఎత్తు అని చెప్పాలి. దాదాపు రెండు మూడు రోజులపాటు ఈ నిమజ్జన వేడుకలు కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే ముంబై లాంటి ప్రదేశాలలో వినాయకుల నిమజ్జనం చేయడానికి ఒక్కొక్కసారి రెండు రోజులు సమయం పడుతుంది.
అయితే ఇలా వినాయకుని ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అసలు వినాయక విగ్రహాలను నీటిలో ఎందుకు నిమజ్జనం చేయాలి దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రకృతి పరంగా చూస్తే వినాయక చవితి వర్షాకాలంలో ప్రారంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి ఆ మట్టితో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులలో, నదులలో, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు.చెరువులలో విగ్రహాల కోసం మట్టిని తీయడం వల్ల చెరువుల్లో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు సులువుగా పారే అవకాశం ఉంటంది.
అదే సమయంలో అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయని చెబుతున్నారు. అటువంటి ఆయుర్వేద గుణాలు ఉన్న నీటిని తాగడం వల్ల మనుషులతో పాటు జంతువులు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మకం. ఎందుకంటే విగ్రహాలను తయారు చేసేందుకు ఉపయోగించిన మట్టి, పత్రి, గరిక , అలాగే విఘ్నేశ్వరుడికి పూజించే 21 ఆకుల వల్ల నీటిలో ఉండే క్రిమికీటకాలన్నీ చనిపోతాయి. దీని వల్ల నీరు శుద్ధి అవుతుంది. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక పౌరాణిక కారణాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం… వినాయకుడు కైలాసం నుండి భూలోకానికి వచ్చి కేవలం పది రోజులు మాత్రమే ఉండి తిరిగి కైలాసానికి వెళ్లిపోతాడు.
భూలోకానికి వచ్చిన వినాయకుడు పది రోజుల పాటు కైలాసానికి దూరంగా ఉంటాడని, పదిరోజుల పాటు నిత్యం పూజలందుకుని, తిరిగి కైలాసానికి రమ్మని పార్వతీదేవి పంపినట్లు పెద్దలు చెబుతుంటారు. అయితే అందులో ఎంత వాస్తవం ఉందన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. దీనికి మరో కారణం కూడా ఉందంటారు. ఏ దేవుని విగ్రహం అయినా మట్టితో చేస్తే అది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే పూజించడానికి అర్హత ఉంటుందని ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని అందుకే వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతుంటారు. వినాయక నిమజ్జనంతో పాటు దుర్గామాత విగ్రహాలను కూడా నవరాత్రులు పూర్తయ్యాక నిమజ్జనం చేసే విషయం గురించి మనకు తెలిసిందే.