Kaal Sarp Dosh: కాలసర్పం దోషం ఉన్నవారు కాళహస్తిలో పూజ చేయించాలా?
కాలసర్ప దోషం ఉన్నవారు శ్రీకాళహస్తిలో పూజ చేయిస్తే నిజంగానే దోషం పోతుందా లేదా అన్న వివరాలను వెల్లడించారు.
- By Anshu Published Date - 05:07 PM, Mon - 16 September 24

భారతదేశంలో హిందువులు భక్తి విశ్వాసాలతో పాటుగా మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని కొన్ని సార్లు మూఢనమ్మకాల పిచ్చిలో పడి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఇంకొందరు దొంగ స్వామీజీలు అంటూ ఎవరు చెబితే వారు ఏది చెబితే అది చేస్తూ ఉంటారు. పేరు బలాలు సరిగా లేవంటే జాతకాలు చెప్పించుకోవడం యోగాలు చేయడం పరిహారాలు చేయడం లాంటివి చేస్తుంటారు. అలా చాలామంది జీవితంలో కాలసర్ప దోషం ఉందని అక్కడికి వెళ్లి పూజ చేయించుకోండి ఈ పరిహారం చేయాలని చెబుతుంటారు. ఎక్కువ శాతం మంది ఈ కాలసర్ప దోషాలతో బాధపడుతున్నాము దీని నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని అంటూ ఉంటారు. అలాగే శ్రీకాళహస్తికి వెళ్లి పూజ చేయిస్తే కాలసర్ప దోషం పోతుందని అంటుంటారు.
మరి ఈ విషయంలో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? అన్న విషయానికి వస్తే.. కాలసర్పదోషం అన్నది జాతకంలో రాహు కేతువుల వలన ఏర్పడుతుంది. జాతకంలో 7 గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ దోషం వలన వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే! జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా వాటిని కాల సర్పదోషం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి ఉద్యోగంలో ఉన్నతి మొదలైన వాటికి ప్రధాన అవరోధంగా మారుతుంది. అయితే ఈ కాల సర్ప దోషం వంశ పారంపర్యంగా లేదా ఒక్కరికైనా గానీ రావచ్చు. చాలామంది అనుకునేది ఏంటి అంటే సర్పాలను చంపడం వలననే ఈ దోషం వస్తుందేమో అని. కొంత నిజమే అయినా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.
సర్పాలను తెలిసిగానీ తెలియకగానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా సంహరించడం చేసినా దోషం వదలదు అని నిర్ణయకౌముది చెబుతుంది. పీడించినా హింసించినా బంధించినా సంహరించినా ఆ పాపం సర్పదోషం రూపంలో మనల్ని పీడిస్తుందట. వంశ క్షయానికి సర్పదోషమే ముఖ్య కారణం. అంతేకాద గురువులు, ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశు పక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుందట. అంటే ధర్మహీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవములపై మనం చేసే సమస్త కర్మలు సర్పశాప స్థితి ద్వారా అమలవుతాయన్నమాట. ఇకపోతే కాళహస్తిలో పూజ చేయిస్తే సరిపోతుందా? అంటే అందరూ ఇలాగే అనుకోని తప్పు చేస్తుంటారు. కానీ ఈ దోషానికి కూడా కాలసర్ప శాంతి అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం అంటున్నారు పండితులు. అలా శాంతి చేయించిన తరువాత కాళహస్తి వెళ్లి అక్కడ రాహు,కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది.
అయితే ఈ దోషం పోవావాలంటే? శాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది 3 రోజులు లేదా 1 రోజు గానీ చేసుకోవచ్చు. గణపతి పూజ – పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మి గణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గో క్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం చేయాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మాసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, మినుములతో; కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేసాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి, ఆయా కలశాల జలంతో కర్తకి మంత్రయుక్తంగా స్నానం చేయించాలి. బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. కుదిరితే పూజలో పాల్గొన్న బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేయాలి. ఇక్కడితో శాంతి ప్రక్రియ పూర్తి అయినట్లే. అయితే ఈ విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా ప్రముఖులు పండితులు సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. వాటిని పాటించాలా వద్దా అన్నది మీ వ్యక్తిగతం మాత్రమే.