Karungali Mala: కరుంగలి మాలకు ఇతర మాలలకు తేడా ఏంటీ.. ఈ మాల ఎప్పుడు ధరించాలి?
Karungali Mala: కరుంగలీ మాలకు అలాగే ఇతర మాలలకు మధ్య తేడా ఏంటో,అలాగే ఈ మాల దరించే టప్పుడు ఎలాంటి విషయాలు పాటించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:00 AM, Sun - 26 October 25
Karungali Mala: ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు కరుంగలి మాల. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ కరుంగలి మాల పేరు మారుమోగిపోతోంది. అయితే మాల గురించి ఆ మాల యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిని కనబరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరుంగళి మాల తో పాటుగా రుద్రాక్ష,తులసి, స్పటిక మాలల పేర్లు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ మాలను ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతర మాలలతో పోలిస్తే దీనికి ప్రత్యేక స్థానం ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. కరుంగలి మాల ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరుంగలి మాల జమ్మి జెట్టు నుంచి తయారు అవుతుంది.
ఈ చెట్టు కలప నల్లగా, గట్టిగా బరువుగా ఉంటుంది. సాధారణంగా 108 పూసలతో తయారయ్యే ఈ మాలలు తమిళనాడు, కేరళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మాల ధరించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆత్మ విశ్వాసం, ఆరోగ్యం, వాస్తుల దోషాలు, వ్యాపార అభివృద్ధి వంటి ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. ఈ మాలను సినీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు ధరించడంతో దీని ప్రాచుర్యం బాగా పెరిగిపోయింది. అయితే కరుంగలి మాల ఒక పవిత్రమైన హారంగా భావిస్తారు. కాబట్టి దీనిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించాలట. కరుంగలి మాల ధరించినప్పుడు మద్యపాన, మాంసాహారం తీసుకోకూడదట.
అలాగనే శృంగారంలో పాల్గొనకూడదట. ఇటువంటి చర్యలు మాలలోని శక్తిని క్షీణింపజేస్తాయని, అది వినియోగానికి పనికి రాకుండా పోవచ్చు అని చెబుతున్నారు. ఒక వేళ బయట మాంసాహారం తినవలసి వస్తే మాలను తీసి ఒక కరవర్ లో ఉంచి మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత ధరించాలట. రాత్రి నిద్రపోయేటప్పుడు కరుంగలి మాలను తీసివేయాలట. దీనిని పూజా మందిరంలో భద్రపరిచి ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించాలని, ఈ నియమం శృంగార ఆలోచనలు కార్యకలాపాల సమయంలో మాల శక్తిని కాపాడటానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒకవేళ స్త్రీలు ఈ మాల ధరించాలి అనుకుంటే నెలసరి సమయంలో మాలను తీసివేయాలట. ఈ సమయంలో దీనిని పూజా మందిరంలో ఉంచి నెలసరి పూర్తిన అయిన ఆరవ రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించాలని చెబుతున్నారు.
మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి అభిషేకంలో ఉంచిన కరుంగలి మాలను మరో మంగళవారం రోజు ధరించి శుభప్రదంగా భావిస్తున్నారు. ఈ అభిషేకం మాలకు అదనపు శక్తిని, పవిత్రతను జోడిస్తుందట.కాగా కరుంగలి మాల ధరించినప్పుడు శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలట. ఆలోచనలు సానుకూలంగా ఉండాలట. మాల ధరించినప్పుడు ఇతర వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు. కరుంగలి మాల ఇతర మాలలతో పోల్చినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. రుద్రాక్ష మాల రుద్రాక్ష చెట్టు గింజలతో, తులసి మాల తులసి చెట్టు కాడంతో, స్పటిక మాల స్పటిక రాళ్లతో తయారవుతాయి. కానీ కరుంగలి మాల జమ్మిచెట్టు కలపతో తయారవుతుంది. ఈ చెట్టు విద్యుదయస్కాంత శక్తిని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇతర మాలలకు ఉండదు.