Vaikunta Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఎప్పుడు.. ఈరోజున ఏం చేయాలో తెలుసా?
Vaikunta Ekadashi 2025: ఈ ఏడాది అనగా 2025లో ముక్కోటి ఏకాదశి లేదంటే వైకుంఠ ఏకాదశి ఏ రోజున వచ్చింది. ఈ రోజున ఏం చేయాలో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:00 AM, Thu - 4 December 25
Vaikunta Ekadashi 2025: ఏడాదికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఈరోజుని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు విష్ణు ఆలయాలలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం గుండా ప్రవేశించి విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని, చెన్నకేశవ స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయట. మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. శేషతల్పంపై శయనించి విష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి ముక్కోటి దేవతలతో పాటు స్వామి వారు భూలోకానికి వచ్చే శుభ సందర్భం.
ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని, శుభ ఫలితాలను పొందవచ్చని చెబుతారు.వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2025 తేదీ, సమయం ఏకాదశి తిధి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 కి మొదలవుతుందట. డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారు జామున 3:30 నుంచి వైష్ణవాలయాల్లో ద్వారదర్శనాలు మొదలవుతాయట.
తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనాన్ని చూడడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు ఏకాంత సేవ జరుగుతుంది. ఆ తర్వాత బంగారు వాకిలిని మూసివేస్తారు. తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలు ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి నాడు ఏకాంత సేవ దాకా ఆలయ గర్భాలయానికి ఆనుకుని ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచే ఉంచుతారు. పది రోజులు పాటు భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు.
21 రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. కాగా వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి? అన్న విషయానికి వస్తే.. వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ మహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని ఉపవాసం ఉంటే ఎంతో మంచిదని చెబుతున్నారు.దామోదర సహిత తులసీదేవిని పూజించాలట.ఉపవాసం చేసేవారు ఆహారం తీసుకోకుండా ఉండడంతో పాటుగా ఎల్లవేళలా భగవంతుడిని తలుచుకోవాలట. నిష్టగా ఏకాదశి ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుందని, ఈ ముక్కోటి ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా ఎంతో మంచి జరుగుతుందని చెబుతున్నారు.