TTD: 24 నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు – త్వరగా దర్శనం కోసం ఇవి తెలుసుకోండి
బ్రహ్మోత్సవాల సమయంలో స్వయంగా వచ్చిన ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం లభించనుందని, సిఫారసు లేఖలు ఎటువంటి సేవలకు ఉపయోగపడవని టీటీడీ స్పష్టం చేసింది.
- By Dinesh Akula Published Date - 05:00 AM, Wed - 24 September 25

తిరుమల: (TTD Tirumala Brahmotsavam) తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుండటంతో, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం లేదా ఉచిత దర్శనానికి చాలా సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, కొన్ని సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటే దర్శనాన్ని త్వరగా పూర్తి చేసుకోవచ్చు.
బ్రహ్మోత్సవాల సమయంలో స్వయంగా వచ్చిన ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం లభించనుందని, సిఫారసు లేఖలు ఎటువంటి సేవలకు ఉపయోగపడవని టీటీడీ స్పష్టం చేసింది. యాత్రికులకు తక్కువ సమయంలో దర్శనం పూర్తయ్యేలా వాహన సేవలు, సమాచార కేంద్రాలు, తలనీలాల సమర్పణ కేంద్రాలు, వైద్య సేవలు వంటి ఎన్నో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
తలనీలాల సమర్పణ కోసం ప్రధాన కల్యాణకట్టతో పాటు జీఎన్సీ, హెచ్వీసీ, నందకం తదితర అతిథిగృహాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సేవల కోసం 1150 మంది క్షురకులు విధులు నిర్వహిస్తారు. అన్నప్రసాదాల కోసం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పంపిణీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ కొనసాగుతుంది.
వసతి కోసం పీఏసీ -1, 2, 3, పద్మనాభ నిలయం అందుబాటులో ఉండగా, కొత్తగా పీఏసీ-5ను సెప్టెంబర్ 25న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అదీ త్వరలో భక్తులకు అందుబాటులోకి రానుంది.
వైద్య సేవల కోసం తిరుమలలో అశ్విని ఆసుపత్రితో పాటు అపోలో అత్యవసర వైద్య కేంద్రం, దక్షిణ మాడ వీధిలో 10-12 పడకల అత్యవసర కేంద్రం, 8 మాడ వీధుల్లో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంటాయి. 50 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది సేవలందిస్తారు.
వాహనాల పార్కింగ్ విషయానికి వస్తే, తిరుమలలో 4,000 వాహనాలకు మాత్రమే 24 ప్రదేశాల్లో పార్కింగ్ అవకాశం ఉంది. తిరుమల నిండినపుడు తిరుపతిలో పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి 100 మీటర్లకు ఒక సమాచార కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
భద్రత కోసం టీటీడీ 2 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు విధుల్లో ఉన్నారు. తిరుమల అంతటా 3 వేల సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ట్యాగ్‌లు వేసి వారిని తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.