Ugadi 2025 : విశ్వావసు నామ సంవత్సరం వచ్చేసింది.. విశ్వావసు ఎవరు? కథేంటి ?
గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వల్ల కబంధుడు(Ugadi 2025) అనే రాక్షసుడిగా మారిపోతాడు.
- By Pasha Published Date - 09:13 AM, Sun - 30 March 25

Ugadi 2025 : ఇవాళ మనం ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చైత్ర శుద్ధ పాడ్యమి వేళ శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. ఇది తెలుగు సంవత్సరాలలో 39వది. విశ్వ, వసు అనే రెండు పదాల కలయికతో విశ్వావసు ఏర్పడింది. ‘విశ్వం వాసయతి’ అంటే ‘విశ్వానికి నివాసాన్ని కలిగించినవాడు, భగవంతుడు’ అని అర్థం. ఈ పేరు మహా విష్ణువుకు కూడా వర్తిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరం అంటే.. శుభకారకుడైన శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరికీ సంతోషాన్ని కలిగించి, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది అని అర్థం.
Also Read :Ramzan 2025: సౌదీలో నేడే రంజాన్.. రేపు భారత్‌లో ఈద్
విశ్వావసు ఎవరు ?
రామాయణం ప్రకారం.. విశ్వావసు ఒక గంధర్వుడు. అతడు దేవ లోకానికి చెందిన గాయకుడు, సంగీతకారుడు, నృత్యకారుడు. గంధర్వుడిగా ఉన్న విశ్వావసు శాపం వల్ల కబంధుడు(Ugadi 2025) అనే రాక్షసుడిగా మారిపోతాడు. కబంధుడి గురించి రామాయణంలో ప్రస్తావన ఉంటుంది. దేవ లోకంలో దాదాపు 6000 మందికిపైగా గంధర్వులు ఉన్నారట. వారిలో ఒకరు విశ్వావసు. విశ్వావసు తపస్సు చేపి సృష్టికర్త బ్రహ్మ నుంచి అమరత్వం పొందుతారు. తనకు ఇక చావు లేదని తెలిశాక.. విశ్వావసు అహంకారిగా మారుతాడు. ఈ అహంకారంతో విశ్వావసు ఏకంగా ఇంద్రుడిపైనే దాడి చేస్తాడు. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వావసు చేతులను, తొడలను శరీరంలోకి తోసేస్తాడు. దానివల్లే విశ్వావసు తల, తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందుతాడు. దీంతో విశ్వావసు తన తప్పు తెలుసుకొని, ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుడిని వేడుకుంటాడు. దీంతో ఇంద్రుడు అతడికి రెండు పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చాడు. శాప విముక్తి ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. ఆ విధంగా విశ్వావసు.. కబంధుడిగా మారిపోయి జీవించసాగాడు.
Also Read :Earth Quakes: 1660 దాటిన మృతులు.. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూవిలయం
శ్రీరాముడి కోసం ఎదురు చూపులు..
ఇంద్రుడు ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కబంధుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉంటాడు. సీతామాతను వెతుకుతూ శ్రీరాముడు.. కబంధుడు నివసించే అడవికి చేరుకుంటాడు. రాముడు, లక్ష్మణుడి దారికి కబంధుడు అడ్డుపడతాడు. దీంతో రాముడు కోపంతో అతడి చేతులను నరికేస్తాడు. చనిపోయే వేళ.. తనకు అంత్యక్రియలు చేయమని రామలక్ష్మణులను కబంధుడు వేడుకుంటాడు. రాముడు అలా చేయగానే.. కబంధుడి రాక్షసరూపం కరిగిపోయి ఆ జ్వాల నుంచి విశ్వావసు దివ్య రూపం బయటికి వస్తుంది. దానితో విశ్వావసు తిరిగి తన గంధర్వలోకానికి వెళ్లిపోతాడు. ఆ విశ్వావసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాలలో ఒక ఏడాదికి పెట్టారు.