Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు ఘనంగా – భక్తులకు 16 రకాల ప్రత్యేక వంటకాలు
బ్రహ్మోత్సవాల సందర్భంగా 229 కళా బృందాలు 29 రాష్ట్రాల నుంచి వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నాయి.
- By Dinesh Akula Published Date - 12:42 PM, Tue - 23 September 25

తిరుమల, ఆంధ్రప్రదేశ్: (Tirumala Brahmotsavam) – తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబరు 2 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు శ్రీవారి దర్శనానికి తిరుమలకు తరలివస్తుండగా టీటీడీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
భక్తులకు ప్రత్యేకంగా 16 రకాల వంటకాలు అందించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వాహన సేవల సమయంలో మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35 వేల మందికి రీఫిల్లింగ్ ద్వారా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.
మాడ వీధుల వద్దకు రాని భక్తులు కూడా వాహనసేవల దృశ్యాలను వీక్షించేందుకు 36 LED స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఆలయంలో మొత్తం రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలు వినియోగించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా 229 కళా బృందాలు 29 రాష్ట్రాల నుంచి వచ్చి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. భద్రతా పరంగా 3000 సీసీ కెమెరాలు, 2000 టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు పనిచేస్తున్నారు.
అన్నప్రసాదాల పంపిణీ ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు సాగుతుంది.
రోజుకు 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ప్రతి 100 మీటర్లకో 10 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
చెప్పుల సమస్యను తగ్గించేందుకు QR కోడ్‌తో కూడిన టోకెన్ల విధానం ప్రవేశపెట్టారు. ఇప్పటికే 90 శాతం సమస్య అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. గదుల లభ్యతను పెంచేందుకు మఠాల నుంచీ 60 శాతం గదులు టీటీడీ తమ హోల్డింగ్‌లోకి తీసుకున్నట్లు తెలిపారు.
అదనంగా కొత్త మౌలిక వసతులు, కాటేజీలు భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. వాహనసేవల సమయంలో ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు 16 వాహనాలలో మాడ వీధుల్లో విహరించనున్నారు.
లక్షలాది భక్తులు ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా టీవీల ద్వారా ఈ దృశ్యాలను వీక్షించనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Sri Venkateswara Swamy’s Annual Brahmotsavam – 2025 has arrived!
September 24 – October 2
Come and receive the grace of Sri Venkateswara Swamy through blissful darshan and devotion-filled processions.#brahmotsavams2025 #tirumala #ttd #brahmotsavams pic.twitter.com/RbDWUGnKLC— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 22, 2025