Mangala Gowri Vratam : మంగళ గౌరీ వ్రతం కథ ఆద్యంతం భక్తిభరితం
శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో నూతన వధువులు వ్రతం ఆచరిస్తుంటారు.
- By Pasha Published Date - 08:00 AM, Wed - 7 August 24

Mangala Gowri Vratam : శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో నూతన వధువులు వ్రతం ఆచరిస్తుంటారు. పార్వతీదేవికి మరో పేరు మంగళ గౌరీ. ఈ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలలో మంగళ గౌరీ మాతను(Mangala Gowri Vratam) కొత్తగా పెళ్లైయిన ముత్తైదువలు పూజిస్తారు. దీనివల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదోతనం కలకాలం నిలుస్తుందని విశ్వసిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
మంగళ గౌరీ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో ప్రస్తావించారు. దాని ప్రకారం.. పూర్వం మహిష్మతీ అనే నగరం ఉండేది. దాన్ని పాలించే జయపాలుడు అనే రాజుకు సంతానం లేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా రాజ దంపతులకు సంతానం కలగలేదు. అయితే ఎట్టకేలకు వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరుడు సన్యాసి రూపంలో మహిష్మతీ నగరానికి వచ్చాడు. రాజ ప్రాసాదం బయటి తలుపు వద్ద నిలబడి ‘భవతీ భిక్షాందేహి’ అని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుడి భార్య బంగారు పళ్లెంలో భిక్షను తీసుకొని వెళ్లే లోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు. ఈవిధంగా వరుసగా మూడు రోజుల పాటు జరిగింది. ఈవిషయాన్ని మహారాణి తన భర్త జయపాలుడికి వివరించింది. దీంతో రేపు ఆ సన్యాసి వచ్చేముందే భిక్ష వేసేందుకు సిద్ధంగా ఉండాలని భార్యతో జయపాలుడు చెప్పాడు. అనుకున్న విధంగా మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి వెళ్లి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. అయితే సన్యాసి ఆ భిక్షను స్వీకరించలేదు. ‘‘సంతానం లేని నీ చేతిభిక్షను నేను స్వీకరించను’’ అని సన్యాసి అంటాడు. దీనికి స్పందించిన మహారాణి.. ‘‘ఓ మహాత్మా! సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి’’ అని కోరుతుంది.
Also Read :Invest In Telangana: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ పెట్టుబడులు..!
దీంతో సన్యాసి రూపంలో ఉన్న శివుడు కరుణించి.. ‘‘నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు అశ్వంపై నగరానికి తూర్పు దిక్కుకు ఒంటరిగా వెళ్లమని నీ భర్తకు చెప్పు. అక్కడ అడవిలో అతడి గుర్రం ఎక్కడైతే కిందపడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయట పడుతుంది. ఆ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త పూజిస్తే మీకు సంతానం లభిస్తుంది’’ అని చెప్పి వెళ్లిపోతాడు. అనంతరం ఈవివరాలను మహారాణి తన భర్తకు చెబుతుంది. దీంతో భర్త అదే విధంగా చేసి నగరం శివారులోని అమ్మవారిని పూజిస్తాడు. దీంతో అమ్మవారు కరుణించి.. ‘కోరినంత ధనం ఇస్తాను’ అని చెప్పారు. కానీ తనకు సంతానమే కావాలని రాజు బదులిచ్చాడు. దీంతో అమ్మవారు.. ‘‘ దీర్ఘాయువు, వైధవ్యము కలిగిన కూతురు కావాలా ? అల్పాయుష్కుడు, సజ్జనుడు అయిన కుమారుడు కావాలా?’’ అని అడిగింది. అప్పుడు రాజు తనకు కుమారుడే కావాలని కోరాడు. దీంతో చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అమ్మవారు సూచించారు. అనంతరం చూత వృక్షానికి ఉన్న పండ్లన్నీ రాజు కోశాడు. దీంతో గణపతికి కోపం వచ్చి శపిస్తాడు. నీకు పుట్టబోయే కుమారుడు 16 ఏళ్ల వయసులో పాముకాటుతో చనిపోతాడని చెబుతాడు.
Also Read :Devi Sri Prasad : తండేల్ తో మరోసారి దేవి మార్క్..!
జయపాలుడి భార్యకు ఒక కుమారుడు కలుగుతాడు. అతడు పెద్దవాడయ్యాక.. పెళ్లి చేద్దామని రాజు భావిస్తాడు. కాశీ విశ్వేశ్వరున్ని దర్శించుకొని రావాలని మేనమామతో కాశీకి పంపుతాడు. కాశీకి వెళ్లే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరుకుంటాడు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలో ఉండగా.. కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడింది. దీంతో ఆ కన్య సుశీలను ‘ముండ’, ‘రండ’ అంటూ తిట్టింది. అప్పుడు సుశీల బదులిస్తూ.. మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబములో ఎవరూ ముండలు, రండలు ఉండరు అని చెప్పింది. జయపాలుడి కుమారుడు శివుడు, అతడి మేనమామ ఇదంతా చూశారు. సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం వచ్చింది. సుశీలను శివుడికి ఇచ్చి పెళ్లి చేయిస్తే తప్పకుండా మంగళ గౌరీ దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. అనంతరం రాజు అనుమతి తీసుకొని.. తన మేనల్లుడికి సుశీలతో పెళ్లి చేయిస్తాడు.
వ్రతం చేశాక..
పెళ్లయ్యాక రాజు జయపాలుడి కొడుకు, కోడలు మంగళగౌరీదేవి వ్రతాన్ని పాటిస్తారు. సుశీలకు కలలో మంగళగౌరీదేవి కనిపించి నీ భర్తకు ఈ రాత్రితో ఆయువు చెల్లిందని చెబుతుంది. కొద్ది సేపట్లో ఒక పాము కరవడానికి వస్తుందని.. పాలు నింపిన కుండను దాని ముందు ఉంచాలని సూచిస్తుంది. పాము ఆ కుండలోకి ప్రవేశించాక గుడ్డతో కట్టేసి.. దాన్ని తల్లికి వాయనంగా ఇవ్వాలని మంగళగౌరీదేవి చెబుతారు. దీనివల్ల భర్తకు ప్రాణగండం తప్పుతుందని అమ్మవారు చెబుతారు. సుశీల అలాగే చేసి తన భర్తను కాపాడుకుంటుంది.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.