Madurai Meenakshi: కోరిన కోర్కెలు తీర్చే మదురై మీనాక్షి అమ్మవారు.. ఆలయ విశేషాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
మధురైలో కొలువుతీరిన మధురై మీనాక్షి అమ్మవారి గురించి అమ్మవారి ఆలయ విశేషాల గురించి గొప్పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:00 AM, Thu - 15 May 25

భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో మధురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి టెంపుల్ కూడా ఒకటి. ఈ మీనాక్షి దేవి మధురలోనే పాండ్యరాజుల వంశంలో జన్మించిందట. మధుర మీనాక్షి ఆలయం ప్రపంచంలోనే ఎత్తయిన రాజ గోపురాలు కలిగిన ఆలయంగా బాగా ప్రసిద్ధి చెందింది. వైగై నదీ తీరంలోని మధురై క్షేత్రం నటరాజ శివుని రజత నాట్య పీఠమని అంటారు. చైత్రమాసంలో, చాంద్రమానం ప్రకారం వైశాఖ మాసంలో మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి చుట్టూ ఉండే పల్లెల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఇకపోతే ఆలయ విశేషాలు విషయానికి వస్తే..
మధుర మీనాక్షి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. సుమారు 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పు ఉండే విశాలమైన ఆవరణలో ఉన్న ఆలయం చుట్టూ కోటగోడ లాంటి ప్రాకారం నిర్మితమైంది. నాలుగు వైపులా ఆలయంలోకి ప్రవేశించేందుకు ద్వారాలు అలాగే వాటి పైన ఎత్తయిన గోపురాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ప్రతీ ఒక్క గోపురం దాదాపుగా తొమ్మిది అంతస్తులను కలిగి ఉంటుంది. పైభాగంలో తొమ్మిది గోపుర కలశాలు ఉంటాయి. ఈ గోపుర ద్వారాల గుండా ప్రాకారంలోకి వెళ్లగానే లోపలి ప్రాకారం దర్శనమిస్తుంది. ఆ ప్రాకారానికి లోపల ప్రధాన ఆలయం ఉంది. అయితే మామూలుగా ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ముందుగా స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత అమ్మ వారిని దర్శించుకుంటూ ఉంటారు.
కానీ మధురైలో ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. తూర్పు ద్వారం నుంచి ప్రవేశిస్తే ముందుగా వచ్చే మండపం అష్టశక్తి మండపం అందులో వినాయకుడు, కుమారస్వామి, శ్రీమీనాక్షి అమ్మవారి పరిణయ శిల్పాలతో పాటు అమ్మవారి అష్టరూపాలను దర్శించుకోవచ్చు. అనంతరం మీనాక్షి నాయకర్ మండపం, దాని తర్వాత చీకటి మండపంగా పిలిచే ముదలి పిళ్ళె మండపం ఉంటాయి. అయితే ఉపాలయాలు ఉన్న మండపాలు దాటగానే కోనేరు కనిపిస్తుంది. దీనికి స్వర్ణకమల తటాకం అని పేరు. అయితే ఈ తటాకానికి పడమటి వైపున ఊంజల్ సేవా మండపం ఉంది. ఈ మండపంలో ప్రతీ శుక్రవారం అమ్మవారికి, స్వామివారికి ఊంజల్ సేవ కన్నుల పండువగా జరుగుతుంది.
దాని తర్వాత వచ్చే మండపం చిలుక మండపం. దీనికే కిళికాట్టు మండపం అని కూడా పేరు, చిలుక మండపం, తర్వాత అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. ముందు ప్రాకారంలో బంగారు ధ్వజస్తంభం, తిరుమల నాయకుని మండపం, ద్వారపాలకులు కొలువుదీరి ఉన్నారు.
గర్భాలయంలో మీనాక్షి అమ్మవారు నిలుచున్న భంగిమలో కొలువుదీరి దర్శనమిస్తారు. ద్విభుజాలతో ఒక చేతిలో చిలుకను ధరించి,మరో చేయి వయ్యారంగా కిందకు జార విడిచి దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారమై వెలిశారు. అమ్మవారిని దర్శించిన వారికి కోరికలు తప్పకుండా తీరుతాయని అక్కడి భక్తుల నమ్మకం.