Nagula Chavithi 2025 : కార్తీక్ మాసంలో నాగల చవితి ఏ రోజు చేసుకోవాలి..!
- By Vamsi Chowdary Korata Published Date - 02:49 PM, Fri - 24 October 25
హిందూ సంప్రదాయంలో పాములకు విశేషమైన ప్రాధ్యాన్యత ఉంది. పాములను పూజించడం హిందూ ఆచారంలో ఓ భాగం. అయితే.. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి రోజు (కార్తీక శుద్ధ చతుర్థి) కార్తీక మాసం )లో నాగుల చవితి పండుగ ను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ చతుర్థి రోజు కూడా జరపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో నాగుల చవితి పండుగ ఆచరిస్తారు. ఈ ఏడాది ఈ నాగుల చవితి 2025 పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని తెలుగు వారు అత్యంత ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి, జంతువుల పట్ల గౌరవ సూచికంగా ఈ వేడుకను చేసుకుంటారు. అయితే ఈ ఏడాది నాగుల చవితి పండుగ ఎప్పుడు వచ్చింది.. పుట్టలో పాలు పొసేందుకు ఏ సమయం మంచిది.. పూజా విధానం తదితర విషయాలు తెలుసుకుందాం..
నాగుల చవితి పండుగ తేదీ.. శుభ ముహూర్తం
ఈ ఏడాది నాగుల చవితి పండుగను అక్టోబర్ 25వ తేదీ జరుపుకోనున్నారు. చవితి తిథి 2025 అక్టోబర్ 25 తెల్లవారుజామున 01.19 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున 03.48 గంటలకు ముగుస్తుంది. ఇక నాగ దేవతల పూజకు శుభ ముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 08.59 గంటల నుంచి 10.25 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ఈ నాగుల చవితి పండుగ రోజు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లు వేస్తారు. చలిమిడి, చిమ్మిరి నైవేద్యంగా చేసి నాగదేవతకు సమర్పిస్తారు. అలాగే జంట నాగుల విగ్రహాలకు పాలు, పసుపు, కుంకుమతో అభిషేకం చేస్తారు. అంతే కాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. మహిళలు సౌభాగ్యం కోసం, సంతానప్రాప్తి కోసం సర్పపూజ చేస్తారు. నాగుల చవితి రోజు నాగదేవతను పూజించడం వల్ల రాహువు గ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అలాగే కుజ దోషం, కాల సర్ప దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
ఇక పురాణాల ప్రకారం నాగుల చవితి పండుగ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాదాపు ప్రతి దేవాలయంలో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే నాగుల చవితి రోజున నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా, శ్రీమహావిష్ణువుకి ఆదిశేషుగా మారి తోడుగా ఉంటాడట. అందుకే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున భక్తులందరూ నాగ దేవతను పూజిస్తే సర్వరోగాలు తొలగిపోతాయని నమ్మకం. అంతే కాకుండా ఈ రోజున సంతానం లేని దంపతులు నాగారాధన చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. నాగదోషం, రాహు కేతు దోషాలు ఉన్న వారు కూడా నాగుల చవితి రోజున నాగేంద్రుడిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.