Tirumala: మే 22న తిరుమలలో నృసింహ జయంతి వేడుకలు
- By Balu J Published Date - 02:38 PM, Wed - 8 May 24

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న నృసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం స్వాతి నక్షత్రం ఆగమనంలో వైశాఖ మాసంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ యోగ నరసింహ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భగుడిలో ఈశాన్య దిశలో పడమర వైపున శ్రీ యోగ నరసింహస్వామి ఆలయం ఉంది. యోగ నరసింహస్వామి విగ్రహాన్ని శాస్త్రం ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామి యోగ ముద్రలో దర్శనమిస్తాడు.
క్రీ.శ.1330-1360 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని, శ్రీ రామానుజాచార్యులు శ్రీ యోగ నరసింహస్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని చెబుతారు.
వసంత మండపంలో శ్రీ నరసింహ స్వామికి పూజలు వైశాఖ మాసంలో భాగంగా తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు శ్రీనరసింహస్వామికి పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా చేయనుంది.