Nishkalank Mahadev Temple : నిత్యం అభిషేకం జరిగే శివాలయం ఎక్కడ ఉందో తెలుసా..?
గుజరాత్ లో మాత్రం నిత్యం అభిషేకంలో పరమశివుడు ఉంటారు.
- By Sudheer Published Date - 03:42 PM, Mon - 14 August 23

పరమ శివున్ని అభిషేక ప్రియుడు అంటారు. ఆయనకు భక్తితో ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే శివాలయానికి వెళ్లిన భక్తులు శివుడికి అభిషేకం చేస్తుంటారు. అంతే కాదు అభిషేక సమయాల్లో అక్కడ ఉండాలనుకుంటారు. మాములుగా శివాలయాల్లో ఆయా సమయాల్లో శివుడికి అభిషేకం చేస్తుంటారు. కానీ గుజరాత్ లో మాత్రం నిత్యం అభిషేకంలో పరమశివుడు ఉంటారు. అలనీ చెప్పి ఏ సమయంలో పడితే ఆ సమయంలో శివుడి అభిషేకం చూడలేరు. ప్రతి రోజు మధ్యాహ్నం తర్వాతే ఆలయంలోకి వెళ్ళగలరు..అభిషేకం చూడగలరు. అదేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే ఆ గుడి సముద్రపు ఒడ్డున ఉండడమే.
గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ (Bhavnagar) పట్టణానికి దగ్గర్లో కొలియాక్ అనే గ్రామం (koliyak village) ఉంది. ఈ గ్రామ సమీపంలోనే అరేబియా సముద్రం ఉంది. ఈ సముద్రంలో ఒడ్డు నుంచి కొద్దిదూరంలో లోపలి ప్రాంతంలో శివాలయం (Nishkalank Mahadev Temple) ఉంది. ఈ శివాలయంలో మహాశివుడికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. కాకపోతే ఆలయ దర్శనం మాత్రం మధ్యాహ్నం తర్వాతే. ఎందుకంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ఆలయం సముద్రపు నీటితో కప్పబడుతుంది. మధ్యాహ్నం కాగానే సముద్రపు నీరు వెనక్కి వెళ్తుంది. దీంతో ఆలయం ప్రత్యక్షమవుతుంది. అలా మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆలయం కనిపిస్తుంది. ఆ తరువాత మళ్లీ నీళ్లు పైకి రావడంతో ఆలయం నీటిలోకి వెళ్తుంది.
ఈ ఆలయం చూడడానికి వెళ్లాల్సి వస్తే మద్యాహ్నం దర్శించుకొని సాయంత్రం లోపు తిరిగి రావాలి. అలాగే ఈ ఆలయంలో 20 మీటర్ల ఎత్తులో ధ్వజస్తంభం ఉంటుంది. ఆలయం నీళ్లలోకి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం మాత్రం కనిపిస్తుంది. ఇక్కడి మహాదేవుడిని దర్శించుకునేందుకు ధ్వజస్తంభంను చూస్తూ ఉంటారు. క్రమంగా నీరు వెళ్లగానే భక్తులు అక్కడికి పయనవుతారు. ఇలా నిత్యం శివుడు అభిషేకంలో ఉంటాడు. అందుకే ఈ గుడికి ఇది ప్రత్యేకం.
Read Also : Independence Day 2023: ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి