Mystery Temple: అక్కడ నీరు తాగితే చాలు ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ మాయం.. ఈ ఆలయ గొప్పతనం గురించి తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం!
ఇప్పుడు తెలుసుకోబోయే హనుమంతుడి ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న నీటిని తాగితే వ్యాధులు నయం అవుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:20 PM, Sat - 3 May 25

రామభక్తుడైన హనుమంతుడి ఆలయం ప్రతి ఒక్క ఊరిలో తప్పనిసరిగా ఉంటుంది. రామనామ స్మరణ ఎక్కడ అయితే వినిపిస్తూ ఉంటుందో అక్కడ తప్పకుండా హనుమంతుడు ఉంటారని భక్తుల నమ్మకం. ఒక్కొక్క ప్రదేశంలో హనుమంతుడు ఒక్కొక అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు చెప్పబోయే ఆలయం కూడా అలాంటిదే కానీ కాస్త ప్రత్యేక అని చెప్పవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి పేరు అర్ధగిరి ఆంజనేయుడు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ఆలయానికి సుమారు 13 కి.మీ దూరంలో ఉంది.
అరగొండ గ్రామంలో ఉన్న కొండపై ఈ అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ పర్వతాన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తారు. అయితే మనకు తెలియని మరుగున ఉన్న ఎన్నో ప్రముఖ క్షేత్రాల్లో ఈ అర్ధగిరి క్షేత్రం కూడా ఒకటి. ఇకపోతే ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే.. అర్థగిరి క్షేత్ర ఆవిర్భావం గురించి రామాయణగాథనే చరిత్రగా చెబుతున్నారు. త్రేతాయుగ కాలంలో సీతమ్మని రావణుడి చేర నుంచి విడిపించేందుకు రామ రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఇంద్రజిత్తు ఆయుధం తగిలి లక్ష్మణుడు మూర్చబోతాడు. లక్ష్మణుడు మేలుకోవాలంటే సంజీవిని అనే దివ్య ఔషధం కావాలని తెలిసి హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ సంజీవిని తీసుకుని రావడానికి వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించాడు.
ద్రోణగిరి పర్వతంపై సంజీవని మొక్క ఎక్కడ ఉందో తెలియని హనుమంతుడు ఏకంగా తన అరచేతుల మీద సంజీవని పర్వతాన్ని పెట్టుకుని మూర్చ బోయిన లక్ష్మణుడి వద్దకు తీసుకుని వస్తుండగా ఔషదులతో ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొస్తున్న ఆంజనేయుడిని భరతుడు చూశాడు. అయితే అప్పుడు చీకటి సమయం, తమకు హాని చేయడానికి రాక్షసులు పర్వతం తెస్తున్నారని భావించిన భరతుడు హనుమంతునిపై బాణం సంధించాడట. అప్పుడు ద్రోణగిరి పర్వతములో సగభాగం విరిగి పెళ పెళరావంతో నేలమీద పడింది. అలా ఔషదాలతో కూడిన ద్రోణగిరి పర్వతం పడిన ప్రాంతమే నేటి అర్ధగిరి. అలా ఈ ఆలయంకి అర్ధగిరి అని పేరు వచ్చింది. ఈ కొండ పడిన ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది. ఆ గ్రామమే అరకొండగా అలా కాల క్రమేణా అరగొండగా రూపాంతరం చెందింది. అయితే ఈ మిగతా హనుమంతుడి ఆలయాల మాదిరిగా కాకుండా ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉత్తరంవైపు ఉంటుందట.
కాగా మృత సంజీవనీ ఔషధపు మొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటి నీటిలో పడిందని అందుకనే ఈ నీటికి దివ్య ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. అందుకనే ఈ కోనేటిని సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. ఈ నీరు తాగడంతో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే కోనేటినందలి నీటిని శరీర జబ్బులు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారట. ఆలయ పరిసరాల్లోని నీరు ఇతర ప్రదేశాలన్నిటిలో కంటే తియ్యగా ఉంటుందట. కొలనులోని నీరు పర్వతం నందలి వివిధ మార్గముల నుంచి అనేక ఔషద మొక్కలను తాకుతూ ప్రవహించి ఈ కొలనును చేరుతుందట. ఈ కోనేటిలో నీరు చేరి వేల సంవత్సరాలు గడిచినా కూడా నేటికీ మనుషులకు సంక్రమించే వ్యాధులను నయం చేయగల ఔషధ గుణాలు ఉన్నాయని నమ్మకం. టి.బి., ఆస్తమా, కీళ్లనొప్పులు సహా అనేక వ్యాధులను నయంచేసే శక్తి ఈ నీటికి ఉందని ప్రసిద్ధి. శారీరక జబ్బులు పోగొట్టి శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం. ఈ పుష్కరిణిలో నీరు 40 రోజు లపాటు సేవించి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.