Spiritual: స్నానం చేయకుండా పూజ చేయవచ్చా.. దీపం వెలిగించవచ్చా?
స్నానం చేయకుండా పూజ చేయవచ్చా లేదా, దీపాలు వెలిగించవచ్చా లేదా అన్న విషయాల గురించి వెల్లడించారు.
- By Anshu Published Date - 01:00 PM, Sun - 13 October 24

స్నానం చేయకుండా పూజ చేయవచ్చా.. అదేం ప్రశ్న అని అనుకుంటున్నారా. ఈ రకమైన సందేహం మనలో చాలామందికి కలిగే ఉంటుంది. కొందరు స్నానం చేయకపోయినా కూడా కాళ్లు ముఖం శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటారు. కొందరు రోజుకీ ఒక్కసారి స్నానం చేస్తే, కొంతమంది రెండు పూటలా స్నానం చేస్తారు. అలాగే స్నానం చేయడం వల్ల కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా, ఆధ్యాత్మిక పరంగా కూడా స్నానానికి ప్రత్యేక స్థానం ఉందట. పూజలు చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేయాలని చెబుతున్నారు. కొంత మందికి పూజ చేయడానికి ముందు స్నానం చేయాలా అని అడుగుతుంటారు? శరీరం పరిశుభ్రంగా వున్నప్పుడే పూజ చెయ్యాలని చెబుతున్నారు.
కానీ కొన్ని సందర్భాలలో రోజూ స్నానం చెయ్యలేక పోవచ్చు. దూర ప్రయాణాలలో కానీ, జబ్బు చెయ్యటం వల్ల కానీ, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు కానీ, వృధ్ధాప్యంలో మంచం మీద నుంచి కదలలేక కానీ స్నానం చేసే పరిస్ధితుల్లో వుండకపోవచ్చు. అలాంటప్పుడు పూజ మానేయాలా? అంటే అక్కర్లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఒకసారి మనం భక్తి మార్గాన పడ్డాక ఆ మార్గాన్ని వదలకూడదట. అప్పటి వరకు మనం చేసుకునే వూజ, పారాయణ మిగిలిన వన్నీ సందర్భాలలో కూడా మానకుండా చేసుకోవచ్చట. ఎలా చేయడం అని అంటారా.. మానసిక పూజని కూడా భగవంతుడు స్వీకరిస్తాడట. వీలయితే తడి గుడ్డతో ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని, మగవారయితే భస్మాన్ని ధరించి, ఆడవారయితే పసుపు నీరు పైన చిలకరించుకుని, మానసిక పూజ చేసుకోవచ్చట.
అయితే ఇలాంటప్పుడు బాహ్యంగా చేసే పూజలు, దీపారాధన, అభిషేకాలు, గుళ్ళో కెళ్ళటం వగైరాలు చెయ్యకూడదు. కానీ మనసులో దీపారాధన చెయ్యవచ్చు. పూజలలు అభిషేకాలు , చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టవచ్చు. అన్ని మానసికంగా చెయ్యవచ్చు. వృధ్ధాప్యంలో బాహ్యంగా పూజలు చేసే శక్తి లేక పోవచ్చు. వారు అలవాటయిన తమ పూజా విధానాన్ని మానసికంగా చేసి తృప్తి చెందవచ్చు. మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. మనం ఎక్కడ వున్నా, ఏ పరిస్ధితుల్లో వున్నా, మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు. ఏ వయసు, ఏ మతం, ఏవర్గం వారికైనా మానసిక పూజ చెయ్యటానికి స్నానంతో సంబంధం లేదట.