Deepam: దీపం ఆరిపోయిన తర్వాత మళ్లీ వెలిగించవచ్చా? పండితులు ఏం చెబుతున్నారంటే?
Deepam: దీపారాధన చేసిన తర్వాత దీపం ఆరిపోతే వెంటనే మళ్ళీ వాటిని వెలిగించవచ్చా, లేదంటే మళ్లీ పూజ మొదటి నుంచి చేయాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 06:31 AM, Wed - 3 December 25
Deepam: మామూలుగా కొందరు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇలా నిత్య దీపారాధన చేసే సమయంలో కొందరు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. ఇంకొందరికి దీపారాధన చేసే సమయంలో అనేక రకాల సందేహాలు అనుమానాలు వస్తూ ఉంటాయి. దీపారాధన ఎలా చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలి. ఒకవేళ పూజ చేసిన తరువాత అనుకోకుండా దీపం ఆరిపోతే ఏం చేయాలి? మళ్లీ వెలిగించవచ్చా వెలిగించకూడదా? ఇలాంటి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి.
ఈ విషయం గురించి ఆధ్యాత్మిక పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు ఇంట్లోని పూజ గదిలో దీపారాధన చేసిన తరువాత మరుసటి రోజు ఆ వత్తులను తీసివేసి కొత్త వత్తులను వేసి దీపారాధన చేయాలి. కొంతమంది ఈరోజు వేసిన వత్తులు బాగా ఉంటే మరుసటి రోజు కూడా అలాగే వాటిని వెలిగిస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదట. అయితే మీరు ఒకే దీపంలో బహుళ వత్తులు వేసి వెలిగిస్తే అందులో ఏదైనా ఒకటి ఆరిపోయి మిగతావి వెలుగుతూ ఉంటే, ఆ వెలుగుతున్న వత్తితో మిగతావి వెలిగించవచ్చని చెబుతున్నారు.
ఒకవేళ మీరు వెలిగించిన అన్ని వత్తులు ఒకేసారి ఆరిపోతే వెంటనే అనగా అప్పటికప్పుడు వాటిని తిరిగి మళ్ళీ వెలిగించవచ్చు అని చెబుతున్నారు. అలాగే ఒక్కసారి దీపారాధనకు ఉపయోగించిన వత్తులు కేవలం ఆ రోజుకు మాత్రమే పరిమితం అని చెబుతున్నారు. కాబట్టి ఇంట్లో నిత్య దీపారాధన చేసేవారు రోజు వత్తులను మార్చి పూజ చేయాలట. అదేవిధంగా చాలామంది దీపారాధన చేసే సమయంలో ముందుగా వత్తి వేసి ఆ తర్వాత నూనె పోస్తూ ఉంటారు. కానీ అలా అసలు చేయకూడదట. మొదట దీపపుకుందులోకి నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తివేయాలని చెబుతున్నారు.