Karthika Masam 2024: కార్తీకమాసంలో ఎలాంటి పనులు చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?
కార్తీక మాసంలో పూజలు చేసేవారు కొన్ని నియమాలను పాటించడంతో పాటు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:35 PM, Thu - 31 October 24

మరో రెండు మూడు రోజుల్లో కార్తీకమాసం మొదలు కానుంది. ఈ కార్తీకమాసంలో ఉదయాన్నే స్నానాలు చేయడంతో పాటు దీపాలు వెలిగించి శ్రీమహా విష్ణువును అలాగే పరమేశ్వరుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ పవిత్ర నదులలో స్నానమాచరిస్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజూ తులసిమొక్కకు పూజ చేస్తారు. అయితే ఈ మాసంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల నియమాలు కూడా పాటించాలని చెబుతున్నారు. ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కార్తీక మాసంలో సూర్యోదయానికి కంటే ముందు నిద్రలేవాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట. కాబట్టి నదీ స్నానం చేస్తే పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాధిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతిరోజూ తులసి మొక్క దగ్గర దీపం ఉంచి ప్రదక్షిణలు చేయాలని చెబుతున్నారు. కార్తీక మాసంలో ఆహారం, ఉన్ని బట్టలు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. కార్తీక మాసంలో విష్ణుమూర్తి రూపమైన శాలిగ్రామాన్ని పూజిస్తే కూడా ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయట.
ఇకపోతే ఎలాంటి పనులు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నీటిలో నివసిస్తాడని నమ్ముతారు. అందుకే చేపలు లేదా ఇతర రకాల తామాసిక ఆహారాలను తినడం మానేయడం మంచిది. ఈ మాసంలో నేలపై పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. అలాగే ఈ మాసంలో శరీరం, మనస్సు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇంద్రియాలపై సంయమనం పాటించాలని చెబుతున్నారు. ఈ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామాసిక ఆహారాలను తీసుకోకపోవడమే మంచిదనని చెబుతున్నారు.