Marriage: కొత్త జంటలు సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా
- Author : Balu J
Date : 04-03-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
Marriage: గృహప్రవేశానికి, ఇతరములైన శుభకార్యాలు చేసుకున్నా, ప్రత్యేకించి కార్తీకమాసంలోనూ ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతాన్ని విధిగా ఆచరించడం మనవారికి అలవాటు. అయితే ప్రస్తుతం అంతా శుభకార్యాలు జరుపుకునే సందర్భం నేపథ్యంలో పెళ్లయిన వెంటనే సత్యనారాయణ స్వామీ వ్రతం ఎందుకు చేయమంటారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఇంట్లో విధిగా ఆచరించడం ఆనవాయితీ ! పెళ్లయిన మరుసటి రోజు ఇంటికి వచ్చిన కొత్త దంపతులతో ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేస్తారు. ఎందుకు ఆ సత్యనారాయణ స్వామీ వ్రతాన్ని విధిగా చేసుకోవాలని చెబుతారని విషయాన్ని మనం పెద్దగా ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చు.
ఒక సంప్రదాయంగా ఈ వ్రతాన్ని కొనసాగించే వారు ఎందరో ఉంటారు. సత్యనారాయణ స్వామీ వ్రతం అనే వరం మనకి నారదుని పుణ్యమా అని సంప్రాప్తినిచ్చిందే. ఆయన్ని కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ లోకోపకారం కోసం ఆయన అందించినన్ని వరాలు, వ్రతాలు మారె మహర్షీ అందించలేదేమో ! అందుకే ఆయన దేవర్షి స్థానాన్ని పొందారు కావొచ్చు. ఇంతకీ ఈ వ్రతాన్ని జాతి, మత, కుల విబేధాలు లేకుండా ఎవరైనా ఆచరించుకోవచ్చు. స్త్రీలుకూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. వ్రతాన్ని ఆచరించడం వలన కలియుగంలో దుఃఖాలు తొలగిపోయి, సకల సంపదలూ సంప్రాప్తిస్తాయని, సంతానం కలుగుతుందని నమ్మం.
కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందుకు , ఆ సత్యనారాయణుని ఆసీస్సులు అవసరమని వారితో తొలుత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు . ఇంకా గర్భాదానానికి ముందర ఈ వ్రతాన్ని దంపతులు ఆచరించడం వలన వారు సత్సంతానాన్ని పొందుతారని విశ్వశిస్తారు. అందువలనే , నూతన దంపతుల చేత సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపజేస్తారు.