Dussehra: దసరా నవరాత్రుల్లో గాయత్రి దేవి విశిష్టత గురించి మీకు తెలుసా
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు.
- By Balu J Published Date - 10:04 AM, Mon - 16 October 23

Dussehra: సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవి ని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది.
ఓం బ్రహ్మకుండికాహస్తాం
శుద్ధజ్యోతిస్వరూపిణీం
సర్వతత్త్వమయీంక
వందే గాయత్రీం వేదమాతరమ్
ఆశ్వయుజ శుద్ధ విదియనాడు కనకదుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరిస్తారు. ఈ తల్లి సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొందింది. ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. గాయత్రీమంత్ర ప్రభావం చాలా గొప్పది. #ఆ మంత్రాన్ని వేయిసార్లు ధ్యానిస్తే చాలు, గాయత్రీమాత అనుగ్రహిస్తుందని, తద్వారా వాక్సుద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.
సకల మంత్రాలకు, అనుష్ఠానాలకు, వేదాలకు మూలదేవతగా గాయత్రీదేవి ప్రసిద్ధి. సమస్త దేవతలకూ నివేదన చేయబోయే పదార్థాలన్నింటినీ ముందుగా గాయత్రీ మంత్రంతో నివేదన చేస్తారు. అంతటి మహిమాన్వితమైన గాయత్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదు ముఖాలతో, వరద అభయ హస్తాలు ధరించి కమలాసనాసీనురాలుగా దర్శనమిస్తుంది.