Deepavali: దీపావళి రోజు పొరపాటున కూడా ఆ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే!
దీపావళి పండుగ రోజు తెలిసీ తెలియకుండా కొన్ని రకాల తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:30 PM, Fri - 25 October 24

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం అన్నది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈరోజున లక్ష్మీదేవితో పాటు ఇంకా కొంతమంది దేవుళ్లను కూడా పూజిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మవారికి విశిష్టంగా పూజలు చేయడంతో పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటి నిండా దీపాలను వెలిగించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులను పేలుస్తూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదని, ఆర్థిక సమస్యలే రావని నమ్మకం ఉంది. అందుకే ఈ రోజు అమ్మవారి అనుగ్రహం పొందడానికి దీపాలను వెలిగిస్తారు.
అలాగే ఇంటిముందు అందమైన రంగును వేస్తారు. అంతేకాదు ఇంటిని అంతా శుభ్రంగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి అమ్మవారు వస్తుందని విశ్వసిస్తారు. కాగా ఈ దీపావళి రోజున చేసే పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి నాడు పూజ సరిగ్గా చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం. అలాగే మనలో చాలా మంది పూజ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాం. ఇవి చిన్న తప్పులే అయినా.. పూజా ఫలితం దక్కకుండా చేస్తాయి. మరీ ఇంతకీ దీపావళి పూజలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. దీపావళి రోజూ పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను సరైన దిశలోనే పెట్టాలి. కానీ చాలా మంది పూజ హాడావుడిలో ఉండి ఈ విషయాన్నే పట్టించుకోరు.
లక్ష్మీ గణేష్ విగ్రహాలను సరైన దిశలో పెట్టకుంటే మీపై ప్రతికూల ప్రభావం పడుతుందట. దీపావళి పూజకోసం లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టడం మంచిది. ఈ దిశలోనే దేవతలు నివసిస్తారని నమ్ముతారు. చాలా మంది లక్ష్మీదేవి విగ్రహాన్ని బాక్సులు లేదా ఫ్యాన్సీ ట్రేలపై పెడతారు. కానీ అమ్మవారి విగ్రహాన్ని చెక్క స్టూల్ మీదే పెట్టాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ స్టూల్ పై ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గుడ్డను పరిచి అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలట. పూజ మొదలు పెట్టే ముందు గంగాజలం లేదా పవిత్ర జలం తీసుకొని మీ ఇంటి అన్ని మూలల్లో చల్లాలట. అలాగే విగ్రహాలను నేరుగా చెక్క స్టూల్ పై పెట్టకూడదట. స్టూల్ పై ఎర్రని గుడ్డను పరిచిన తర్వాత కొన్ని గులాబీ రేకులతో దాన్ని అలంకరించాలని చెబుతున్నారు.
దీనిపై కొత్తిమీర ఆకులను ఉంచడం కూడా శుభప్రదం అని చెబుతున్నారు. అలాగే దీపావళి పూజలో లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాలను పక్క పక్కన పెట్టకుండా పూజ చేయకూడదట. ఈ పూజలో ఒక కలశాన్ని తీసుకుని దానికి పచ్చి పసుపు, వెండి నాణెం, బియ్యం, పువ్వులు, మామిడి ఆకులతో అలంకరించాలని చెబుతున్నారు. దీన్ని వెండి గిన్నెతో కప్పి ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన కొబ్బరికాయను కుండపై ఉంచితే అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు. కొబ్బరికాయ మీకు ఎదురుగా ఉండే విధంగా పెట్టాలట.