TTD : అక్టోబర్ 24న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..!!
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది
- Author : hashtagu
Date : 22-10-2022 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
కాగా సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 24న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టిటిడి రద్దు చేసింది.