Deepavali: దీపావళి రోజు లక్ష్మి పూజా ఎలా చేయాలో తెలుసా?
దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి అన్న విషయాల గురించి పండితులు తెలిపారు.
- By Anshu Published Date - 01:11 PM, Tue - 22 October 24

సనాతన ధర్మంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు పేలుస్తూ దీపాలను వెలిగిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు. మరి ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవిని ఎంతో శ్రద్ధగా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దీపావళి పండుగ లక్ష్మీదేవికి పూజ చేయకుండా చేయడం అన్నది సంపూర్ణంగా భావిస్తారు. ఇకపోతే త్వరలోనే దీపావళి పండుగ రాబోతోంది. మరి పండుగ రోజున లక్ష్మీ పూజను ఎలా జరుపుకోవాలి?ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
దీపావళి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పుణ్య స్నానాలు ఆచరించాలి. అలాగే ఇంటితో పాటుగా ఆలయాన్ని కూడా శుభ్రం చేయాలి. అలాగే ఇంటిని పూలు, దీపాలు, రంగోలితో అలంకరించాలి. కొత్త, శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి. లక్ష్మీదేవి పూజ కోసం అన్ని వస్తువులను సిద్ధం చేసుకోవాలి. అలాగే చాలా మంది ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. సాయంత్రం చెక్క టేబుల్ పై శ్రీ యంత్రం, గోపాలుడితో పాటుగా వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే ఈరోజున ఈ రోజు 21 మట్టి దీపాలు వెలిగించాలి. 11 తామర పువ్వులు, తమలపాకు, లవంగాలు, వివిధ రకాల స్వీట్లు, ఖీర్ లను సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.
ఇక ముందుగా వినాయకుడికి, లక్ష్మీదేవికి తిలకం పెట్టాలి. ఆ తర్వాత లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజు మీ నగలను, డబ్బును లక్ష్మీదేవి ముందు పెట్టి అంతా మంచే జరగాలని ప్రార్థించాలి. పూజ చివరిలో లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇవ్వాలి. దీపావళి పండుగ రోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.