Char Dham Yatra: చార్ ధామ్ యాత్రికులకు బిగ్ రిలీఫ్…ఆ నిబంధనలు లేవ్..!!
హిమాలయ పర్వత శ్రేణుల్లో పవిత్ర ఆధ్యాత్మిక చార్ ధామ్ ను చేరుకోవాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే.
- By Hashtag U Published Date - 07:15 AM, Mon - 2 May 22

హిమాలయ పర్వత శ్రేణుల్లో పవిత్ర ఆధ్యాత్మిక చార్ ధామ్ ను చేరుకోవాలంటే ఎంతో సాహసం చేయాల్సిందే. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ యాత్రకు వెళ్లడం అద్రుష్టంగా భావిస్తుంటారు. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా…చార్ ధామ్ నే ప్రత్యేక ఆధ్యాత్మిక పుణ్యభూమిగా పిలుస్తుంటారు. పాపాలను హరించి…మోక్షానికి మార్గం చూపించే చార్ ధామ్ యాత్రలో ఎన్నో విశేషాలు ఉంటాయి. హిమాలయ స్థాణువుల్లో అత్యంత శీతల ప్రాంతంలో సముద్ర మట్టానికి పదివేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదరనాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సర్వపాపాలను హరించే చార్ ధామ్ గా చెప్పుతుంటారు.
సనాతన ధర్మానికి, హైందవ సంస్క్రతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా…నాలుగు వేదాల పవిత్రతను మించి స్వర్గప్రాప్తిని కలిగించే పవిత్ర తీర్థాలే చార్ ధామ్ అని త్రిమూర్తులు చెప్పారని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉంది. అయితే ప్రతిఒక్కరూ తమ జీవితంలో ఇలాంటి చార్ ధామ్ యాత్రను చేపట్టాలని ప్రతిఒక్క హిందువు కోరుకుంటాడు. అయితే హిమాలయాల్లో ఉండే అనుకూల, ప్రతికూల పరిస్థితుల మధ్య ఉత్తరాఖండ్ సర్కార్ పరిమితంగానే భక్తులకు అనుమతి ఇస్తోంది.
ఈ సంవత్సరం మే 3న ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉత్తరాఖండ్ సర్కార్ పెద్ద ఊరటను ఇచ్చింది. కోవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అవసరంలేదని తెలిపింది. అయితే యాత్రకు ముందు భక్తులందరూ విధిగా రాష్ట్ర పర్యాటక పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. యాత్ర తేదీ దగ్గరపడుతుండటంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు కోవిడ్ నిబంధనల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు అధికారులతోభేటీ అయ్యారు. పరిస్థితులన్నింటిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాని సందు ఆదేశించారు. అయితే ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 1.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ పోర్టుల్లో నమోదు చేసుకున్నారు.