చైనాలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్. ఎందుకు తెలుసా?
- By Anshu Published Date - 08:24 PM, Tue - 20 December 22

చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. కరోనా తగ్గకపోవడంతో చైనా విలవిలలాడిపోతుంది. కరోనా దెబ్బకు జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన తర్వాత చైనాలో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. రాబోయే మూడు నెలల్లో దాదాపు 60 శాతం మంది ప్రజలు కరోనా బారిన పడే అవకాశముందని చెబుతున్నారు.
అయితే కరోనా పంజా విసురుతున్న సమయంలో ప్రజలు ఇంటి వైద్యంపై వైపు మొగ్గు చూపుతున్నారు. హోమ్ రెమిడీలను చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా నిమ్మరసాన్ని ఎక్కువగా తాగుతున్నారు.ఇమ్యూనిటీని పెంచుకోవడంలో భాగంగా నిమ్మకాయ రసాన్ని చైనీయులు తెగ తాగేస్తున్నారు. దీంతో చైనాలో నిమ్మకాయలకు తెగ డిమాండ్ పెరిగిపోయింది.
డిమాండ్ పెరగడంతో చైనాలో నిమ్మకాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సీ విటమిన్ కలిగిన పదార్థాలు బాగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతో సీ విటమిన్ ఎక్కువగా లభించే నిమ్మకాలను చైనీయులు ఎక్కువగా తీసుకుంటున్నారు. నిమ్మకాయల కోసం మార్కెట్ల వద్ద క్యూ కడుతున్నారు. ఎగబడి మరీ నిమ్మకాయలను కొనుగోలు చేస్తోన్నారు.
ఇక నిమ్మకాయలతో పాటు నారింజ, పియర్స్, పీచ్ పండ్లకు కూడా విపరీతంగా గిరాకీ పెరిగింది. వీటికి కొనుగోలు చేసేందుకు ప్రజలు షాపుల వద్ద బారులు తీస్తున్నారు. దీంతో వీటి రేట్లు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కాగా చైనాలో గత కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి, హాస్పిటళ్లు కరోనా రోగులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మరణాలు కూడా పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం కంటే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని, కానీ అధికారిక లెక్కల్లో వాటిని చూపించడం లేదనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో వినిపిస్తోన్నాయి. ఇప్పట్లో ఇది తగ్గేలా కనిపించడం లేదు.