Piracy : ఇక పైరసీ భూతం వదిలినట్లేనా..? ఇండస్ట్రీ కి మంచి రోజులు రాబోతున్నాయా..?
Piracy : టాలీవుడ్ ఇప్పుడు ఊపిరిపీల్చుకునే స్థితికి చేరుకుంది. సంవత్సరాలుగా సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీకి ప్రధాన దోషిగా పేరుగాంచిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు కావడంతో పాటు, అతని ఆధ్వర్యంలో నడిచిన యాప్‌లు
- By Sudheer Published Date - 12:15 PM, Tue - 18 November 25
టాలీవుడ్ ఇప్పుడు ఊపిరిపీల్చుకునే స్థితికి చేరుకుంది. సంవత్సరాలుగా సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న పైరసీకి ప్రధాన దోషిగా పేరుగాంచిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టు కావడంతో పాటు, అతని ఆధ్వర్యంలో నడిచిన యాప్‌లు, వెబ్‌సైట్లను మూసివేయించడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు నిజంగా షాక్ కు గురి చేస్తున్నాయి. ఒక్క పైరసీ ద్వారానే ఇరువై కోట్లకు పైగా సంపాదించడం, ఇరువై వేల సినిమాలను హార్డ్‌డిస్క్‌లలో దాచిపెట్టడం, పైగా “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అంటూ నేరుగా ఛాలెంజ్ చేయడం అన్నీ సినీ వర్గాలకు, పోలీసులకు ఒకేలా ఆశ్చర్యం కలిగించాయి. సజ్జనార్‌తో కలిసి సినీ ప్రముఖులు చేసిన ప్రెస్ మీట్ దృష్ట్యా చూస్తే, ఈ అరెస్టు రంగానికి ఒక పెద్ద గండం తప్పిందన్నది నిజం.
అయితే ఇక్కడితో పైరసీ కథ ముగిసిపోయిందా? అనే కాదనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా పైరసీకి వేర్లు బాగా లోతుగా పాతుకుపోయాయి. రవి ఒక ముఖ్య పాత్రధారి మాత్రమే కానీ, మొత్తం నెట్‌వర్క్‌లో ఇంకా ఎన్నో శాఖలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళ్ రాకర్స్, టొరెంట్స్, ఎంవి కమ్యూనిటీల వంటి పెద్ద సైట్లు రిలీజ్ రోజే కొత్త సినిమాల ప్రింట్లు వేస్తూ వస్తున్నాయి. వీరు కెమెరా ప్రింట్ల నుంచి నేరుగా హెచ్డీ క్వాలిటీ వర్షన్ల వరకూ పది సంవత్సరాలుగా పైరసీని మరింత “ప్రొఫెషనల్” చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్ కూడా ఈ నెట్‌వర్క్ ఎంత పెద్దదో, ఎంత ప్రమాదకరమో చెప్పింది. కాబట్టి నిజమైన విజయం అంటే ఈ పెద్ద నెట్‌వర్క్‌ను చెరిపేసినప్పుడే సాధ్యమవుతుంది.
హైదరాబాద్ పోలీసుల తదుపరి లక్ష్యం కూడా ఇదే కావాలని సినీ రంగం కోరుకుంటోంది. పైరసీ పూర్తిగా అదుపులో ఉంటే మాత్రమే ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వస్తారు. సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్న లింకులు, టెలిగ్రామ్ గ్రూపులు, డార్క్ వెబ్ సర్వర్లు ఇలా అన్ని కట్టడి చేయగలిగితే బాక్సాఫీస్‌కు వందల కోట్ల ప్రయోజనం చేకూరుతుంది. సజ్జనార్ మాటల్లోనూ కఠిన చర్యలు చేపట్టబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. పైరసీకి మూలమైన సర్వర్లను అప్‌గ్రేడ్ చేసి, డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను ట్రేస్ చేసే టెక్నాలజీని మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. అది జరిగితేనే తెలుగు సినిమా పరిశ్రమకు ఇది నిజమైన టర్నింగ్ పాయింట్ అవుతుంది.