Renuka Swamy Murder Case: రేణుక స్వామి హత్యా కేసులో స్టార్ హీరో దర్శన్ కు బెయిల్!
దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఆరు వారాల పాటు ఈ బెయిల్ ఇవ్వబడింది.
- By Kode Mohan Sai Published Date - 01:12 PM, Wed - 30 October 24

రేణుకాస్వామి హత్య కేసులో గత ఐదు నెలలుగా జైలు జీవితం గడుపుతున్న కన్నడ నటుడు దర్శన్‌కు చివరకు బెయిల్ మంజూరు అయ్యింది. కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ కల్పించింది. అతని ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో పాటు, బెయిల్‌కు తగిన షరతులను న్యాయస్థానం విధించింది.
అంతకుముందు, కింది కోర్టులో దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించబడింది. ఆ తర్వాత, దర్శన్ తరపు న్యాయవాది సీవీ నగేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ యొక్క ఆరోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకుని, బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో అభ్యర్థించారు.
దర్శన్‌కు తీవ్ర వెన్నునొప్పి ఉందని, శస్త్రచికిత్స అవసరమని పేర్కొన్నారు. చికిత్స ఆలస్యమైనట్లు ఉంటే, పక్షవాతం వచ్చే అవకాశం ఉందంటూ డాక్టర్ ఇచ్చిన నివేదికను దర్శన్ తరపు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
దర్శన్ ఆరోగ్య సమస్యలపై నివేదిక ఇచ్చేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ కోర్టులో వాదించారు. ప్రస్తుతం సమర్పించిన డాక్టర్ రిపోర్టులో, దర్శన్‌కు చేయాల్సిన శస్త్రచికిత్స మరియు కోలుకోవడానికి పట్టే సమయం గురించి సరైన సమాచారం లేదని వెల్లడించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్, “విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని” పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. అయితే, ఈ బెయిల్ ఆరు వారాల కాలానికి మాత్రమే మంజూరైంది.