Shankar: ఆ విషయం నన్ను ఎంతో బాధించింది.. ఈడీ చర్యలపై అసహనం వ్యక్తం చేసిన శంకర్!
డైరెక్టర్ శంకర్ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న చర్యల గురించి స్పందిస్తూ ఒకింత అసహనం చేశారు.
- By Anshu Published Date - 02:34 PM, Sat - 22 February 25

తమిళ దర్శకుడు శంకర్ ఇటీవల రాంచరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే దర్శకుడు శంకర్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎంథిరన్ సినిమాకు సంబంధించి నమోదైన కాపీ రైట్ ఉల్లంఘన కేసులో భాగంగా శంకర్ కు చెందిన దాదాపు రూ.10 కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ఈడీ చర్యలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. చెన్నై జోనల్ కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నను. ఎంథిరన్ మూవీకి సంబంధించి నిరాధారమైన ఆరోపణలను ఆధారంగా చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను అటాచ్ చేశారు. ఈ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడం మాత్రమే కాకుండా చట్ట ప్రక్రియ దుర్వినియోగాన్ని కూడా సూచిస్తుంది.
అయితే ఎంథిరన్ కాపీరైట్ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు బాగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్ష్యా ధారాలు, ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎంథిరన్ కి సంబంధించిన అసలైన హక్కులు తనకే ఉన్నాయి అంటూ అరూర్ తమిళనాథన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ కేసుపై ఇప్పటికే న్యాయస్థానం తీర్పునిచ్చినప్పటికీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ఈవిధంగా ఈడీ నా ఆస్తులను అటాచ్ చేసింది. కాపీరైట్ ఉల్లంఘన అనేది జరగలేదని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి ఇలా చర్యలు తీసుకోవడం నన్నెంతో బాధించింది అని తెలిపారు. ఈడి చర్యల పట్ల ఆయన ఒకింత సహనం వ్యక్తం చేశారు.