Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : మూడుముళ్లతో ఒక్కటైనా విజయ్-రష్మిక
రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ వేదికగా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10:10 గంటలకు సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు
- Author : Sudheer
Date : 26-02-2026 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
Rashmika Mandanna-Vijay Deverakonda Wedding : టాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్ వేదికగా, అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 26, గురువారం ఉదయం 10:10 గంటలకు సుముహూర్తాన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విజయ్, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం ఒక మధురమైన గమ్యానికి చేరుకుంది.
ఈ వివాహ వేడుక దక్షిణ భారత సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించబడింది. పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పూర్‌లోని ఒక విలాసవంతమైన ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. ఉదయం జరిగిన సంప్రదాయ వివాహం అనంతరం, సాయంత్రం రష్మిక పుట్టిన ప్రాంతమైన కొడగు (కూర్గ్) ఆచారాల ప్రకారం ‘కొడువ’ పద్ధతిలో మరోసారి వివాహ వేడుక జరగనుండటం విశేషం. రష్మిక తన మూలాలను గౌరవిస్తూ ఈ ప్రత్యేక పద్ధతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
విజయ్-రష్మిక ఒక్కటైన వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ముఖ్యంగా ‘X’ (ట్విట్టర్) వేదికగా ‘VIJAY DEVARAKONDA’, ‘RASHMIKA’ అనే హ్యాష్ ట్యాగ్‌లు జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ఈ జంట ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిన అభిమానులు, ఇప్పుడు నిజజీవితంలో కూడా వారు తోడు కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త దంపతులకు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.