Manchu Manoj : తనపై 10 మంది దాడి చేసారంటూ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
Manchu Manoj : నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని , దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లానని
- By Sudheer Published Date - 09:38 PM, Mon - 9 December 24

నిన్నటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మంచు మోహన్ బాబు ఫ్యామిలీ (Manchu Mohan Babu Family) హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో ఆస్థి గొడవలు తారాస్థాయికి వెళ్లాయని..ఆఖరికి మనోజ్ పై దాడి (Manoj Attack) కూడా చేసారని మాట్లాడుకుంటున్నారు. గత కొద్దీ నెలలుగా మంచు మనోజ్ -vs – విష్ణు ల మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రితమే మనోజ్ అనుచరుడి పైన విష్ణు దాడి చేయడం, ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మనోజ్ పై దాడి చేయడం..ఆయన హాస్పిటల్ లో చేరడంతో అందరూ ఇంకాస్త ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా ఈరోజు మంచు మనోజ్ తన నివాసంలో దాడి జరిగినట్లు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మరింత సంచలనంగా మారింది. నిన్న ఉదయం తన ఇంటికి పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని ఆపడానికి ప్రయత్నించే క్రమంలో తనకు గాయాలు అయ్యాయని , దాడి తర్వాత ఆసుపత్రికి వెళ్లానని, తాను హాస్పటల్ కు వెళ్ళగానే సీసీటీవీ ఫుటేజి మాయం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజిని తొలగించారని కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటనలో తన భార్య, పిల్లల ప్రాణాలకు ముప్పు ఉందని కూడా పోలీసులకు వివరించారు.
ఈ ఫిర్యాదు పై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మీడియా తో స్పందించారు. మనోజ్ ఫిర్యాదులో ఎవరి పేర్లు స్పష్టంగా ప్రస్తావించలేదని తెలిపారు. మంచు మనోజ్ తన కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి ఆరోపణలు చేయలేదని, దాడి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదని అన్నారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే పోలీసు బృందం మంచు మనోజ్ ఇంటికి చేరుకుందని, అయితే అప్పటికే దాడి జరిగినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజి మాయమైన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మంచు మనోజ్ ఆరోపణల నేపథ్యంలో ఈ దాడి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Captain Pat Cummins : బంతి ఏదైనా టీమిండియాకు కళ్లెం వేస్తున్న పాట్ కమిన్స్