Indian 3 : 2025 సంక్రాంతికి ఇండియన్ 3.. చిరు, పవన్‌కి పోటీగా కమల్..!
2025 సంక్రాంతికి ఇండియన్ 3ని తీసుకు వస్తామంటూ చెబుతున్న కమల్ హాసన్. ఆల్రెడీ సంక్రాంతి భారీలో మెగా బ్రదర్స్..
- By News Desk Published Date - 01:28 PM, Sun - 19 May 24

Indian 3 : కమల్ హాసన్, శంకర్ కాంబోలో 28 ఏళ్ళ క్రిందట వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘భారతీయుడు’. ఇన్నాళ్ల తరువాత ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. ఇక ఈ సీక్వెల్ ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ రెండు భాగాలకు ఇండియన్ 2, ఇండియన్ 3 అనే టైటిల్స్ ని ఖరారు చేసారు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇంకా నిర్ణయించలేదు. కానీ ఏ సమయంలో తీసుకు వస్తాము అనేది మాత్రం తెలియజేసారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని శంకర్ అండ్ కమల్ హాసన్ స్టార్ట్ చేసారు.
రీసెంట్ గా ముంబైలో ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమంలో ఇండియన్ 2, ఇండియన్ 3 రిలీజ్స్ గురించి ప్రశ్నించగా, కమల్ హాసన్ జవాబు ఇచ్చారు. ఇండియన్ 2ని జులైలో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఇండియన్ 3ని ఏమో ఆరు నెలలు గ్యాప్ లో రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ 2 జులైలో వస్తే.. ఆరు నెలలు గ్యాప్ అంటే 2025 జనవరే కనిపిస్తుంది.
ఇప్పటికే 2025 సంక్రాంతికి వచ్చేందుకు చిరంజీవి డేట్ ఫిక్స్ చేసుకొని కూర్చొన్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా 2025 సంక్రాంతికే రాబోతుందని సమాచారం. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగాన్ని జనవరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారట.
అయితే వీరమల్లు రిలీజ్ పై ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతి భారీలో పోటీ పడేందుకు మెగా బ్రదర్స్ సన్నిధం అవుతుంటే.. ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఆ భారీలో పోటీకి దిగుతా అంటున్నారు. మరి ఫైనల్ గా 2025 సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారో చూడాలి.