Samantha : సమంత వెకేషన్ల వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
Samantha : ‘ఖుషీ’ సినిమా విడుదల అనంతరం ఆమె అమెరికాలో ఎక్కువ కాలం గడిపింది. అంతకు ముందు భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లింది
- By Sudheer Published Date - 11:15 AM, Mon - 5 May 25

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇటీవల వరుసగా విదేశీ వెకేషన్లకు (Foreign Vacations) వెళ్లడంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ‘ఖుషీ’ సినిమా విడుదల అనంతరం ఆమె అమెరికాలో ఎక్కువ కాలం గడిపింది. అంతకు ముందు భారతదేశంలో ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లింది. కెరీర్ మధ్యదశలో సమంతలో వచ్చిన ఈ మార్పు ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా గడిపే సమంత, ఇప్పుడు ప్రయాణాలను కీలకంగా తీసుకుంటోంది. ఈ వెకేషన్ల టూర్ వెనుక మానసికంగా శాంతి ఇస్తాయని, వాటితో మనలో ఓర్పు, సహనం పెరుగుతాయని ఆమె నమ్మకమట.
సమంత ప్రకృతిని ఆస్వాదించడాన్ని, వైల్డ్ లైఫ్ చూడటాన్ని ఎంతో ఇష్టపడుతుంది. అందుకే బాలీ, స్విట్జర్లాండ్, న్యూయార్క్, ఆస్ట్రియా వంటి ప్రదేశాలను సందర్శించింది. ప్రయాణాల కోసం ముందే ప్లాన్ చేసి, లిస్ట్ తయారు చేసుకుని, అవకాశమొచ్చినప్పుడల్లా ఒక్కో ప్రాంతాన్ని దర్శిస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రయాణాల ద్వారా తన గురించి మరింత తెలుసుకోవడం సాధ్యమవుతుందనీ, ఎక్కడికి వెళ్లినా ఫిట్‌నెస్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయదని సమంత స్పష్టం చేసింది. ఆత్మాన్వేషణ కోసం చేసిన ఈ ప్రయాణాలు ఆమె వ్యక్తిత్వాన్ని బలపర్చినట్టు తెలుస్తోంది.
కెరీర్ పరంగా చూస్తే సమంత గత ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉంది. ‘ఖుషీ’ తర్వాత ఇప్పటివరకు వెండి తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తుండగా, ‘శుభం’ అనే చిత్రంలో ఒక ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఈ సినిమాకు తానే నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇక అంతర్జాతీయంగా భారీ అంచనాలతో వచ్చిన ‘సీటాడెల్’ సిరీస్ సెకండ్ సీజన్ రద్దు కావడం, మొదటి సీజన్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం ఓ నిరాశగా మారింది. అయినప్పటికీ సమంత మాత్రం ఉత్సాహం తో సినిమాలు చేస్తుంది.