Harry Potter Reboot : హ్యారీ పాటర్ మరోసారి తెరపైకి.. కొత్త హీరోతో HBO Max రీబూట్
Harry Potter Reboot : ప్రపంచవ్యాప్తంగా ఫాంటసీ సినిమాల అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన హ్యారీ పాటర్ సిరీస్ మరోసారి తెరపైకి రాబోతోంది.
- By Kavya Krishna Published Date - 07:17 PM, Tue - 15 July 25

Harry Potter Reboot : ప్రపంచవ్యాప్తంగా ఫాంటసీ సినిమాల అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన హ్యారీ పాటర్ సిరీస్ మరోసారి తెరపైకి రాబోతోంది. అభిమానుల కోసం HBO Max తాజాగా ఈ సిరీస్‌ను రీబూట్ చేస్తోందని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రీబూట్ వెర్షన్‌కి, ప్రధాన పాత్ర అయిన హ్యారీ పాటర్‌గా స్కాట్లాండ్‌కు చెందిన డొమినిక్ మెక్‌లాఫ్లిన్ ఎంపికయ్యారు. హాగ్వాట్స్ యూనిఫారమ్ ధరించి గుండ్రటి కళ్లద్దాలు వేసుకుని, క్లాప్‌బోర్డ్ పట్టుకున్న డొమినిక్ ఫస్ట్ లుక్ ఇటీవల HBO Max అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయింది. “First Year, Step Forward” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ ఫోటో ద్వారా సిరీస్ అధికారికంగా ప్రారంభమైందని సంస్థ వెల్లడించింది.
ఈ రీబూట్ వెర్షన్ కూడా J.K. రౌలింగ్ రచించిన నవలల ఆధారంగా రూపొందించబడుతోంది. రచయితగా మాత్రమే కాకుండా ఈ సారి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ రౌలింగ్ వ్యవహరిస్తున్నారు. రైటింగ్ టీంతో కలిసి ఆమె మొదటి రెండు ఎపిసోడ్‌లను చూసి ఎంతో సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. కొత్త హ్యారీ పాటర్‌తో పాటు రోరి విల్మట్ నెవిల్ లాంగ్‌బాటమ్ పాత్రలో, ఎమోస్ కిట్సన్ డడ్లీ డర్స్లీగా, లూయిస్ బ్రిలీ మేడమ్ రోలాండా హూచ్ పాత్రలో, ఎంటోన్ లెసెర్ గారిక్ ఒలివెండర్‌గా కనిపించనున్నారు.
1997లో తొలి హ్యారీ పాటర్ నవల ‘Harry Potter and the Philosopher’s Stone’ ప్రచురితమై, 2001లో అదే కథ ఆధారంగా రూపొందిన సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మొత్తం ఎనిమిది సినిమాలు విడుదలైన ఈ సిరీస్ గ్లోబల్ లెవల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించి, హ్యారీ పాటర్ పాత్రను అందరికి అప్రతిమంగా పరిచయం చేసింది. ఇప్పుడు అదే మాయాజాలాన్ని, కొత్త తరం నటులతో మరింత ఆధునికంగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న HBO Max ప్రయత్నం అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. కొత్త హ్యారీ ఎలా ఆకట్టుకుంటాడో, ఈ రీబూట్ వెర్షన్ ఎంతవరకూ ఒరిజినల్ మ్యాజిక్‌ను మళ్లీ చూపించగలదో చూడాలి.
Grok : యూదులపై విద్వేషం వెళ్లగక్కిన గ్రోక్.. ఎలాన్ మస్క్ AIకి ఏమైంది?