రాజా సాబ్ టీం పై ఫ్యాన్స్ ఫైర్
రేపు (శనివారం) జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మొదట హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించినప్పటికీ,
- Author : Sudheer
Date : 26-12-2025 - 1:30 IST
Published By : Hashtagu Telugu Desk
- ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై సస్పెన్స్
- ప్రమోషన్ విషయంలో వెనుక
- ఆకట్టుకోలేకపోయిన సాంగ్స్
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్నా, ప్రమోషన్ల విషయంలో జరుగుతున్న జాప్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, కేవలం 13 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు, రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ప్రభాస్ రేంజ్ సినిమాకు ఉండాల్సిన స్థాయిలో భారీ హైప్ ఇంకా రాలేదన్నది అభిమానుల వాదన. దర్శకుడు మారుతి నేతృత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, ప్రమోషన్ల విషయంలో సరైన స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Raajasaabh Prabhas
ఈ క్రమంలోనే రేపు (శనివారం) జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మొదట హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం భావించినప్పటికీ, అక్కడ పోలీసుల అనుమతి లభించలేదు. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వైపు మొగ్గు చూపినా, చివరకు కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో నిర్వహించేందుకు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈవెంట్ సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఇతర ప్రాంతాల నుండి వచ్చే అభిమానులు ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.
మరోవైపు, జనవరి తొలి వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మారుతి బృందం సిద్ధమైంది. సినిమాకు కావాల్సిన అసలైన బజ్ ఈ ట్రైలర్ ద్వారానే వస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ప్రభాస్‌ను సరికొత్త హారర్ కామెడీ జానర్‌లో చూడాలనే ఆత్రుత ఒకవైపు ఉన్నా, మరోవైపు ప్రమోషన్ల విషయంలో నిర్మాతలు మరింత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వీకెండ్‌లో జరగబోయే ఈవెంట్ మరియు కొత్త ట్రైలర్ సినిమా రేంజ్‌ను ఎంతవరకు పెంచుతాయో వేచి చూడాలి.