Super Star Biography: టాలీవుడ్ ‘డేరింగ్ అండ్ డ్యాషింగ్’ హీరో ఈ నటశేఖరుడు!
ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ 79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
- By Balu J Published Date - 11:26 AM, Tue - 15 November 22

ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. అయితే ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్ చేయాలనుకున్నారు. కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు. అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు. 1965లో ఇందిరను కృష్ణ వివాహం చేసుకున్నారు.
వీరికి ఐదుగురు సంతానం. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయనిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. డిగ్రీ తర్వాత కూడా ఇంజినీరింగ్ సీటు కోసం ప్రయత్నించినా రాకపోవడంతో కృష్ణ ఇక సినిమాలనే తన భవిష్యత్తుగా ఎంచుకున్నారు. నటులు జగ్గయ్య, గుమ్మడి, నిర్మాత చక్రపాణి తెనాలికి చెందినవారు కావడంతో మద్రాసు వెళ్లి వారిని కలిశారు కృష్ణ. వయసు తక్కువగా ఉందనీ, కొంతకాలం ఆగి మద్రాసు వస్తే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని వారు సలహా ఇవ్వడంతో తిరిగి వచ్చిన కృష్ణ, ప్రజానాట్య మండలిలో చేరి గరికపాటి రాజారావు సహకారంతో పలు నాటకాల్లో నటించి నటనపై అవగాహన పెంచుకున్నారు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘తేనె మనసులు’ సినిమాతో కృష్ణ సినీ ప్రయాణం మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ నటన బాగోలేదని ఆయనను తొలగించాలని దర్శకుడిపై ఒత్తిడి వచ్చింది. అయినా ఆదుర్తి సుబ్బారావు తన నిర్ణయం మార్చుకోలేదు. 1965లో విడుదలైన ఆయన సినిమా ఘన విజయం సాధించింది.
గూఢచారి 116 సక్సెస్‌తో.. 20 సినిమాల్లో ఛాన్స్ కొట్టాడు. రెండో సినిమా ‘కన్నె మనసుల్లో’ నటిస్తుండగానే ‘గూఢచారి 116’లో కృష్ణకు అవకాశం వచ్చింది. ఈ సినిమా అఖండ విజయం సాధించి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అంతేనా.. తెలుగు ప్రేక్షకులు ముద్దుగా ఆయనను ఆంద్రా జేమ్స్ బాండ్‌గా పిలుచుకునేవారు. ఈ విజయంతో కృష్ణ ఏకంగా 20 సినిమాలకు హీరోగా ఎంపికయ్యారు. గూఢచారి 116తో ఆయన ఇమేజ్ అమాంతం పెరగడమే గాక.. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆయన మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు. అవన్నీ ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టాయి. బాపు తీసిన పూర్తి అవుట్ డోర్ చిత్రం ‘సాక్షి’ కృష్ణ ఇమేజ్ ని పెంచింది. మానవత్వం మీద నమ్మకంగల పల్లెటూరి అమాయకుడి పాత్రలో నటించి మెప్పించిన చిత్రమిది. విజయనిర్మలతో నటించిన మొదటి చిత్రం కూడా ఇదే.
70-71వ దశకంలో కృష్ణ నటన తెలుగు ప్రేక్షకులకు మరుపురానిది. ఒక ఏడాదిలో పదుల సంఖ్యలో ఆయన సినిమాలు విడుదలయ్యేవి. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత 1969లో 15 సినిమాలు, 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాలు, 1980లో 17 సినిమాలు విడుదలయ్యాయి. ఒక దశలో కృష్ణ రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు.
నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ కెరీర్‌లో కృష్ణ 340కు పైగా సినిమాల్లో నటించారు. సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ ‘డేరింగ్ అండ్ డాషింగ్’ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 1970లో పద్మాలయా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి విజయవంతమైన చిత్రాలు తీశారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతలు, జానర్‌లను పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు), తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగుదేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన ‘శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి చిత్రం.
సినీరంగంలో విశేష సేవలందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997), ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. నటుడిగా, నిర్మాత, దర్శకుడిగా, నిర్మాణ సంస్థగా ఐదు దశాబ్దాల పాటు కృష్ణ అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. 350కిపైగా సినిమాల్లో నటించిన సినీ ప్రేక్షకుల్లో చెలగరని ముద్ర వేసిన సినీ పరిశ్రమ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు ప్రజల్లో సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా కృష్ణ జనాదరణ పొందారన్నారు. పద్మభూషణ్, సూపర్ స్టార్ డాక్టర్ కృష్ణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగంలో అనేక విప్లవత్మక మార్పులు తెచ్చి నూతన ఒరవడి సృష్టించిన కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటు అని అన్నారు.