Nandamuri Balakrishna : నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది హీరో బాలకృష్ణ
బాలయ్యకు భిన్నంగా, గంభీరంగా కనిపించే ఈ ఘట్టం అభిమానుల మన్ననలు అందుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేస్తూ, ‘‘బాలయ్య బాబు లెవెలే వేరు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:06 PM, Mon - 8 September 25

Nandamuri Balakrishna : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలోకి చేరుకున్నారు. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, బాలకృష్ణ బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా చరిత్ర సృష్టించారు. ఎన్‌ఎస్‌ఈ అధికారుల ఆహ్వానంపై బాలకృష్ణ ఈ కార్యాలయాన్ని సందర్శించి, మార్కెట్ ప్రారంభోత్సవ ఘట్టంగా బెల్ మోగించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలయ్యకు భిన్నంగా, గంభీరంగా కనిపించే ఈ ఘట్టం అభిమానుల మన్ననలు అందుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేస్తూ, ‘‘బాలయ్య బాబు లెవెలే వేరు’’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Kavitha : బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు వ్యూహాత్మక చర్చలు: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణకు మరో విశిష్ట గుర్తింపు లభించింది. ఆయన పేరిట ఒక ప్రత్యేక ఘనత ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో నమోదైంది. బాలయ్యకు వరుసగా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు లభిస్తుండటం అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది. ఇక, సినిమాల విషయానికి వస్తే, బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2: తాండవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2021లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ఎం. తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. కథానాయికగా సంయుక్తా మేనన్, కీలక పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు.
డిసెంబరు తొలి వారం ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాణాంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం వహిస్తే, మరొకటి మాస్ యాక్షన్‌కి నిదర్శనంగా నిలవనుంది. సినిమాకు సంగీతం అందిస్తోన్న ఎస్.ఎస్. తమన్ మళ్లీ బాలయ్యతో హిట్ కాంబినేషన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం విడుదలకు ముందు బిజినెస్ రికార్డులు తిరగరాయే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.