బంగారం డిమాండ్ ఢమాల్
2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.
- Author : Sudheer
Date : 30-01-2026 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుండడం తో బంగారం కొనుగోలు చేసేందుకు పెద్ద ఇంట్రస్ట్ చూపించడం లేదు. దేశంలో వివాహాల సీజన్ జోరుగా సాగుతున్నప్పటికీ, బులియన్ మార్కెట్లో మాత్రం సందడి కనిపించడం లేదు. బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడమే ఇందుకు ప్రధాన కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే ఈసారి పసిడి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2024లో భారతీయులు 802.8 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా, 2025 నాటికి అది 11 శాతం క్షీణించి 710.9 టన్నులకు పడిపోయింది. ప్రస్తుత 2026 సంవత్సరంలో ఈ డిమాండ్ మరింత తగ్గి, కేవలం 600 నుంచి 700 టన్నుల మధ్యే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టి ధరల పెరుగుదల వల్ల కొనుగోళ్లు ఎంతలా మందగించాయో అర్థం చేసుకోవచ్చు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బంగారం పరిమాణం పరంగా అమ్మకాలు తగ్గినప్పటికీ, వాటి విలువ (Value) మాత్రం భారీగా పెరిగింది. 2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది. ఇది పూర్తిగా పసిడి ధరల్లో వచ్చిన అసాధారణ పెరుగుదల ప్రభావమే. తక్కువ బరువున్న ఆభరణాల వైపు లేదా పెట్టుబడి కోసం డిజిటల్ గోల్డ్ వైపు వినియోగదారులు మళ్లుతున్నారనే సంకేతాలను ఈ గణాంకాలు ఇస్తున్నాయి.

Gold Price
ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో జనవరి 30న నమోదైన ధరలు షాక్ ను కలిగిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,78,850 కి చేరగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 1,63,950 కి ఎగబాకింది. కేవలం ఒక్కరోజులోనే సుమారు రూ. 12,000 వరకు ధర పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న తరుణంలో ఈ ‘గోల్డ్ షాక్’ సామాన్యుల బడ్జెట్‌ను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తోంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరగడంతో, మధ్యతరగతి ప్రజలు ఆభరణాల దుకాణాల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు.