Upcoming EVs: త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. టాప్ లో ఆ కంపెనీ కార్!
ఇప్పటికే మార్కెట్లో ఉన్న కార్లతో పాటు త్వరలోనే మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 11 September 24

రోజురోజుకీ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ పెరిగిపోవడంతో అందుకు అనుగుణంగా ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే త్వరలోనే మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి త్వరలో విడుదల కాబోతున్న ఆ ఎలక్ట్రిక్ కార్లు ఏవి? వాటి ప్రత్యేకతలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఎంజి విండర్స్ ఈవీ కారు ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఇది మన దేశంలో లాంచ్ కానుంది. ఇది ఈ బ్రాండ్ నుంచి వస్తున్న మూడో ఎలక్ట్రిక్ కారు. కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీల తర్వాత బ్రిటీష్ బ్రాండ్ ఎంజీ నుంచి వస్తున్న మూడో కారు ఈ విండ్సర్. ఈ కొత్త కారు 50.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే అవకాశం ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 460 కి.మీ వస్తుందని చెబుతున్నారు. ప్రధాన ఫీచర్లలో పెద్ద 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్ లైన్-రకంగా ఉండే వెనుక సీట్లు 135 డిగ్రీ రిక్లైనింగ్ ఫంక్షన్లతో లాంజ్ లాంటి వైబ్, పనోరమిక్ సన్రూఫ్ వంటివి ఉన్నాయి. ధర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అదేవిధంగా కొరియన్ ఆటో దిగ్గజ సంస్థ కియా నుంచి కియా ఈవీ9 మార్కెట్లోకి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ కారు అక్టోబర్ మూడవ తేదీన దేశవ్యాప్తంగా లాంచ్ కానుంది. అదే రోజు కొత్త తరం కార్నివాల్ ఎంపీవీని కూడా విడుదల చేస్తున్నారు. ఈవీ9 ఒక వేరియంట్ గానే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే చాలు దాదాపు 434 కి.మీ పరిధిని అందిస్తుంది. 379 బీహెచ్పీ, 700ఎన్ఎం టార్క్ అవుట్పుట్, లెవెల్ 3 అడాస్ సూట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.
అదేవిధంగా గ్లోబల్ వైడ్ గా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు చెమటలు పట్టిస్తున్న చైనా ఈవీ బ్రాండ్ బీవైడీ. ఈ కంపెనీ నుంచి ఈ6 ఎలక్ట్రిక్ ఎంపీవీని కొత్త అవతార్ లో లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. దీనిలో డిజైన్ అప్డేట్లతో పాటు, కొత్త ఈ6 పెద్ద 12.8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, మరిన్నింటిని పొందే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద 71.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఒకే చార్జ్ తో దాదాపు 530 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. 204 బీహెచ్పీ, 310ఎన్ఎం టార్క్ అవుట్ పుట్ ను అందిస్తుంది. అలాగే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు విడుదల అవుతుంది అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
దేశవ్యాప్తంగా ఉన్న కార్లలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు మేబ్యాక్ ఈక్యూఎస్ 680. ఈ కారుని విడుదల చేసిన తర్వాత ఈ లగ్జరీ బ్రాండ్ నుంచి ఈక్యూజీ/ ఎలక్ట్రిక్ జీ వ్యాగన్ పేరుతో కొత్త ఎస్ యూవీ రానుంది. బెంజ్ ఇప్పటికే భారతదేశంలో జీ క్లాస్ ఎస్‌యూవీ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ కోసం బుకింగ్ ను తెరిచింది. ఇది గతంలో ఈక్యూజీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గ్లోబల్ మార్కెట్లలో ప్రదర్శితం అవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీలో 116కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 470 కి.మీ రేంజ్ ని ఇస్తుంది.
ఇక ఇందులో చివరి స్థానంలో ఉన్న ఎలక్ట్రిక్ కారు టాటా హారియర్ ఈవీ. ఇండియా ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉంది. అనేక మోడళ్ల ఈవీలు ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్నాయి. దీనిని మరింత విస్తరించేందుకు టాటా మోటార్స్ యోచిస్తోంది. ఈ క్రమంలో టాటా హారియర్ ఈవీని లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఐసీఈ మోడల్లో చిన్న చిన్న మార్పులు చేసి, డిజైన్ ను అలాగే ఉంచుతోంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ సామర్థ్యాలు, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్ అంచనా వేస్తున్నారు.