Tata Nano EV Car: అదిరిపోయే ఫీచర్లతో టాటా నానో ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ఒక లుక్ వేసేయండి!
సామాన్యుడి కలల కారుగా ప్రసిద్ది చెందిన టాటా నానో, ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది.
- By Kode Mohan Sai Published Date - 05:04 PM, Sat - 9 November 24

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం వేగంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ఖర్చును తగ్గించడమే కాకుండా, పొల్యూషన్ లేకుండా ప్రయాణించడానికి ఈ వాహనాలు ఎంతో అనుకూలంగా మారాయి. ఈ నేపథ్యంలో, వాహన రంగంలో ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న టాటా మోటార్స్, టాటా నానో ఎలక్ట్రిక్ వాహనం (Tata Nano EV) ఈ డిసెంబరులో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా, టాటా నానో ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించి ధర, ఫీచర్లు, మరియు ఇతర ముఖ్యమైన వివరాలను పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, అన్ని ప్రముఖ కార్ కంపెనీలు ఈవీ మోడళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో, టాటా నానో ఎలక్ట్రిక్ వాహనం కూడా మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. టాటా నానో ఈవీని బేసిక్ వేరియంట్‌లో కేవలం రూ.2.5 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ధరతో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.
మార్కెట్ వర్గాల ప్రకారం, టాటా నానో ఈవీ బేస్ వేరియంట్ ధర రూ.2.5 లక్షలతో ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు, అలాగే హైఎండ్ ఫీచర్స్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ.8 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అయితే, ధరలపై అధికారిక స్పష్టత ఇంకా రాలేదు.
ఈ టాటా నానో ఈవీ, రతన్ టాటా కలల కారుగా చెప్పబడుతుంది, వాహన రంగంలో ఒక సరికొత్త ట్రెండ్‌ను సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సిటీ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారులో తక్కువ ధర, స్టైల్, మరియు కంఫర్ట్ విషయంలో ఎలాంటి కాంప్రమైస్‌లు చేయకుండా టాటా ఈవీని మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది.
మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఈవీ ఫీచర్లు ఈ విధంగా ఉంటాయి:
టాటా నానో ఈవీ 17kWh బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయగలిగితే, కారు 312 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అలాగే, గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగం నమోదు చేసుకోవచ్చు. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో రూపొందించబడిన ఈ వాహనం, 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకోగలదని తెలుస్తోంది. ఫుల్ ఛార్జింగ్ చేయడానికి 6 నుండి 8 గంటల సమయం తీసుకోనుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా సౌకర్యాన్ని కలిగి ఉండి, నలుగురు వ్యక్తులు కూడా సౌకర్యంగా కూర్చునేలా ప్లాన్ చేయబడింది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, టాటా నానో ఈవీ ఒక కాంపాక్ట్ కారుగా రూపకల్పన చేయబడింది. అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఈ వాహనం పొడవు 3,164mm, వెడల్పు 1,750mm, వీల్ బేస్ 2,230mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180mmగా ఉండనుందని సమాచారం.
కారు ఫీచర్లలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్షన్, పవర్‌ఫుల్ 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ (ABS) వంటి ఆధునిక టెక్నాలజీని అందిస్తుంది.
అదేవిధంగా, ఏసీ, పవర్ స్టీరింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి కీలక సౌకర్యాలు కూడా ఈ కారులో ఉన్నాయి.
టాటా సంస్థ 2008లో కేవలం లక్ష రూపాయల ధరతో టాటా నానో కారును మార్కెట్లోకి విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించింది. అయితే, అనేక సవాళ్లు, మార్కెట్ లోపాలు, మరియు ప్రొడక్షన్ సమస్యల వల్ల 2018లో టాటా నానో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.
అయితే, తరువాత టాటా సంస్థ తన ఫోకస్‌ను టాటా నానో ఎలక్ట్రిక్ వెర్షన్‌పై సారించి, ఈ కారును పర్యావరణ స్నేహపూర్వకంగా, అనువైన మరియు అదనపు సౌకర్యాలతో మార్కెట్లోకి కొత్త రూపంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.