VijaySaiReddy on SRV: సర్కారువారి పాట సినిమాపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్
విజయసాయిరెడ్డి రూటే వేరు. ఏపీలో ప్రతిపక్షంపై చురకలు వేసే పనిలో బిజీగా ఉండే ఆయన.. ఈసారి సినిమాల మీద ఫోకస్ పెట్టారు.
- Author : Hashtag U
Date : 13-05-2022 - 6:07 IST
Published By : Hashtagu Telugu Desk
విజయసాయిరెడ్డి రూటే వేరు. ఏపీలో ప్రతిపక్షంపై చురకలు వేసే పనిలో బిజీగా ఉండే ఆయన.. ఈసారి సినిమాల మీద ఫోకస్ పెట్టారు. అది కూడా మహేశ్ బాబు సినిమాను టార్గెట్ గా చేసుకున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ పనితీరును పొగడడం లేదా టీడీపీ వైఖరిని విమర్శించడం.. ఆయన ఎక్కువగా ఇలాంటి ట్వీట్లే చేస్తుంటారు. కానీ ఈసారి మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారువారి పాట సినిమాపై తన మనసులో మాట బయటపెట్టారు.
వైసీపీ సర్కారు తీరును, సీఎం జగన్ పరిపాలనను పొగగడం తప్ప విజయసాయిరెడ్డి నోట మరో విషయంపై ప్రశంసలు వచ్చిన సందర్భాలు అరుదు. అలాంటిది ఈసారి మహేశ్ బాబుకు ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ.. సర్కారు వారి పాట సినిమాను ప్రశంసించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం ‘సర్కార్ వారి పాట’ బాగుందని.. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానాన్ని
తెరపై బాగా ఆవిష్కరించారని.. ఈ సినిమాను ప్రశంసించారు.
సర్కారువారి పాట సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. నేను విన్నాను, నేను ఉన్నానంటూ మహేశ్ ఓ డైలాగ్ ను హీరోయిన్ తో చెబుతాడు. ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదేంటి.. జగన్ డైలాగ్ మహేశ్ నోట పలికిందా అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆ సినిమా దర్శకుడు పరశురామ్ వివరణ ఇచ్చారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అని అందుకే జగన్ డైలాగును తన సినిమాలో ఉపయోగించానన్నారు.
సినిమాలో మహేశ్ నోట జగన్ డైలాగ్ రావడం, ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ఈ సినిమా బాగుందని చెబుతూ ట్వీట్ చేయడంతో దీని వెనుక కథేంటి సాయినాథా అని అభిమానులు ఊహాగానాల్లో మునిగిపోయారు.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022