Jagan New Districts Tour : కొత్త జిల్లాల పర్యటనకు జగన్ శ్రీకారం
కొత్త జిల్లాల పర్యటనకు సీఎం జగన్ గురువారం శ్రీకారం చుట్టనున్నారు.
- By CS Rao Published Date - 05:09 PM, Wed - 6 April 22

కొత్త జిల్లాల పర్యటనకు సీఎం జగన్ గురువారం శ్రీకారం చుట్టనున్నారు. తొలుత పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట లో పర్యటిస్తారు. షెడ్యూల్‌లో భాగంగా ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. ఉదయం 10.50 గంటలకు పీఎన్‌సీ కళాశాలలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.అనంతరం ఉదయం 11.00 గంటలకు స్టేడియానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొని అదే వేదికపై స్వచ్ఛంద సేవకులను సన్మానించి ప్రోత్సాహకాలు అందిస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు నరసరావుపేటలో బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం పనులు ప్రారంభించింది. నరసరావుపేట పర్యటన అనంతరం మధ్యాహ్నం వైఎస్ జగన్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. రాజీనామా చేయాల్సిన మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. కొత్త మంత్రివర్గం ఏప్రిల్ 11న ప్రమాణ స్వీకారం చేయనుంది.