Tragedy : నెల్లూరులో మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారా?
Tragedy : కట్నం పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాల్సిన అవసరం ఎంతవో మరోసారి ఈ ఘటన తేటతెల్లం చేసింది
- Author : Sudheer
Date : 10-04-2025 - 3:57 IST
Published By : Hashtagu Telugu Desk
నెల్లూరు జిల్లా(Nellore District)లో జరిగిన మహిళ హత్య (Woman’s Murder) కలకలం రేపుతోంది. మహిళను నిర్భయంగా, అమానుషంగా వివస్త్ర చేసి మరణించే వరకు కొట్టారని స్థానికులు చెబుతున్నారు. భర్త, అత్త, మామలు, ఆడబిడ్డ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కట్నం కోసం మానవత్వాన్ని మరిచిపోయి, తీవ్ర హింసకు గురి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హత్య అనంతరం దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
MLC Kavitha : చంద్రబాబు , లోకేష్ లపై ఎమ్మెల్సీ కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. అయితే ఘటన తర్వాత భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఓ మహిళను ఇంత క్రూరంగా హింసించి హత్య చేయడంపై మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను వెంటనే పట్టుకుని కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాయి. కట్నం పేరుతో జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాల్సిన అవసరం ఎంతవో మరోసారి ఈ ఘటన తేటతెల్లం చేసింది.