Super Six Guarantees : కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాము – పవన్
Super Six Guarantees : చంద్రబాబు హయాంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని..కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చమన్నారు.
- By Sudheer Published Date - 07:09 PM, Wed - 18 September 24

Pawan Kalyan : ఏపీలో కూటమి సర్కార్ (Kutami Sarkar) అధికారంలోకి వచ్చి ఈ నెల 20 కి సరిగ్గా 100 రోజులు పూర్తీ (100 Days Complete) అవుతుంది. ఈ క్రమంలోనే వంద రోజుల్లో తాము ఏం చేశామని ప్రజలకు వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ (Cabinet Meeting) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) మాట్లాడారు.
చంద్రబాబు హయాంలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని..కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని , ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ హామీ ఇచ్చినట్లు పింఛన్లను పెంచి చూపించామని వెల్లడించారు. చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్యర్యపరుస్తూ, ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందని కొనియాడారు.
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. జీతాల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేది..కానీ ప్రస్తుతం ఒకటో తేదీనే అకౌంట్లలోకి జీతం పడుతుందని గుర్తు చేసారు. అలాగే నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చి జీవం పోశారన్నారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లాభం జరుగుతుందని , ఎంతో మంది కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించిందని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని చాలామంది సూచించారు, ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజమండ్రి జైల్లో చంద్రబాబు ను కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశా. బాబులో ఆత్మస్థైర్యం ఏనాడూ దెబ్బతినలేదు. పాలన ఎలా ఉండాలో బాబు పక్కనే ఉండి నేర్చుకోవాలనుకున్నా. జైల్లో ఉన్నప్పుడు నేను సినిమా షూటింగులకు కూడా వెళ్లలేదు. షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రానని చెప్పా నని పవన్ గుర్తు చేసారు.
ఇక మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలు (Decisions taken by the Cabinet) :
వలంటీర్ల పునరుద్దరణపై మరింత సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశాలు జారీచేశారు. ప్రైవేట్ మద్యం దుకాణాలకు అనుమతిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే వరద సాయం ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ చేసారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. కౌలు రైతులకు పంట నష్టపరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు. బుడమేరు వరద ముంపుకు గురైన ఇళ్లలో యజమానులకు అద్దెకు ఉంటూ సామాన్లు పాడైన బాధితుల్ని గుర్తించి ఇవ్వాలని నిర్ణయించారు. వరదలు అధిక వర్షాల వల్ల పంట నష్టపరిహారం చెల్లింపు కౌలు రైతులకు దక్కేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది.